లారీ కింద పడి ప్రాణాలతో బయటపడిన యువకుడు | - | Sakshi
Sakshi News home page

లారీ కింద పడి ప్రాణాలతో బయటపడిన యువకుడు

Apr 4 2025 1:14 AM | Updated on Apr 8 2025 1:53 PM

పెనమలూరు: పోరంకి సెంటర్‌లో గురువారం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అనకాపల్లికి చెందిన సింగంపల్లి గోవిందు పని కోసం పోరంకికి వచ్చాడు. అతను పోరంకి సెంటర్‌లో బైక్‌పై డివైడర్‌ కటింగ్‌ వద్ద రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న టిప్పర్‌ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌తో పాటు గోవిందు లారీ కిందకు వెళ్లాడు. ఒక్కసారిగా అందరూ గోవిందు ప్రాణాలకు ముప్పు జరిగిందని భావించారు. అయితే అతను లారీ మధ్యలో ఉండటంతో లారీ చక్రాలు అతని పైకి ఎక్కలేదు. అతను సురక్షితంగా లారీ కింద నుంచి బయటకు వచ్చాడు. స్వల్వ గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

పమిడిముక్కల: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై గురజాడ బైపాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన చాగంటిపాటి వీరభద్రరావు(82) గురజాడ వెళ్తుండగా, ఉయ్యూరు నుంచి మచిలీపట్నం వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే సీఐ చిట్టిబాబు, ఏఎస్‌ఐ రాజ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిట్టిబాబు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి

గుడివాడరూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామానికి చెందిన వలిశెట్టి వనాజీ(50) సిద్ధాంతం గ్రామ పరిధిలోని పెట్రోల్‌ బంక్‌లో ఆటోలో ఆయిల్‌ కొట్టించుకుని నలుగురి ప్రయాణికులతో గుడివాడ వైపు వస్తుండగా గుడ్లవల్లేరు వైపు నుంచి వస్తున్న మరొక ప్యాసింజర్‌ ఆటో ఢీ కొంది. దీంతో సదరు ఆటో పల్టీకొట్టగా ఆటోడ్రైవర్‌ వనాజీకి తీవ్ర గాయాలయ్యాయి. 

వెంటనే స్థానికులు, వాహనదారులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆటోలోని నలుగురు ప్రయాణికుల్లో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారికి ఎటువంటి గాయాలు కాలేదు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement