మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని కొల్‌కత(వెస్ట్ బెంగాల్) సీఐఎస్‌ఎఫ్ బృందం శుక్రవారం దర్శించుకుంది. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఆలయ సిబ్బందితో కలసి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్ట లో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు విరూప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కొల్‌కత నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర చేపట్టిన సీఐఎస్‌ఎఫ్ బృందానికి ఆలయ అధికారి మధుసూదనరావు, స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.
నీరు అత్యంత విలువైన వనరు
గుడివాడటౌన్: ప్రపంచంలో అత్యంత విలువైన వనరు నీరు అని 11వ అదనపు జిల్లా జడ్జి జి.సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. నీటి వాడకంలో మార్పులను ప్రేరేపించడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. శనివారం జరగనున్న ప్రపంచ నీటి దినోత్సవంను ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నీటి నిల్వలు పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటిని సంరక్షించాలని, నీటి వినియోగంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నీటిని వృథా చేయకుండా ఉండటం, పరిశుభ్రమైన నీటిని తాగడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు. నీటి కాలుష్యం తగ్గేలా, నీటిలో ప్రమాదకరమైన రసాయనాల విడుదల అరికట్టేలా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పర్వతాలు, అడవులు, చిత్తడి నేలలు, నదులు, జలాశయాలు, సరస్సులు వంటి నీటి సంబంధిత పర్యావరణ వ్యవస్థను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ట్రాఫిక్ డీసీపీ నాయుడుకి మహోన్నత సేవా పథకం
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా పథకానికి ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎం.కృష్ణమూర్తి నాయుడు ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో సమర్థంగా పనిచేసి ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు గాను 2025వ సంవత్సరానికి మహోన్నత సేవా పథకానికి ఎంపికయ్యారు. 1989లో కృష్ణమూర్తి నాయుడు ఎస్‌ఐగా సర్వీస్ ప్రారంభించి అంచెలంచెలుగా డీసీపీ స్థాయి హోదాకు ఎదిగారు. సేవా పథకానికి ఎంపికై న కృష్ణమూర్తి నాయుడుని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ప్రత్యేకంగా అభినందించారు.
జన గణనతో పాటే
కుల గణన జరపాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు
మంగళగిరి: జనగణనతోపాటే సమగ్ర కుల గణన జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబీసీల ప్రధాన డిమాండ్లపై జాతీయస్థాయిలో ఈ నెల 24,25,26 తేదీలలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ కోటాలో ఓబీసీ మహిళల సబ్ కోటా చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీల ప్రధాన డిమాండ్లపై 24న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సమగ్ర కుల గణనపై జాప్యాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద 25న ధర్నా చేపడతామన్నారు. 26న ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మరి క్రాంతికుమార్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉప్పాల శివలక్ష్మి, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యుని సన్నిధిలోసీఐఎస్‌ఎఫ్ బృందం
సుబ్రహ్మణ్యుని సన్నిధిలోసీఐఎస్‌ఎఫ్ బృందం