నాగాయలంక: దుక్కిదున్నుతూ ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని భావదేవరపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ కలిదిండి రాజేష్ కథనం మేరకు.. భావదేవరపల్లి గ్రామానికి చెందిన ముమ్మారెడ్డి నరసింహారావు(36) అదే గ్రామానికి చెందిన అబ్రహం ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా బుధవారం రాత్రి చెరువుల్లో దుక్కి దున్నే పనికి వెళ్లాడు. ఒక చెరువు నుంచి మరో చెరువులోకి వెళ్లే క్రమంలో గట్టు దాటుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడింది. నరసింహారావు ట్రాక్టర్ కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ ఘటనను అతని బంధువులు, గ్రామస్తులు రాత్రి 11 గంటల సమయంలో గుర్తించారు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడి తండ్రి ముమ్మారెడ్డి బెనర్జి ఈ ప్రమాదంపై గురువారం ఉదయం నాగాయలంక స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.