కోనేరుసెంటర్: మహిళల రక్షణకు పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యమిస్తోందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. అందుకోసం శక్తి టీంలను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ నిమిత్తం కొత్తగా ఏర్పాటు చేసిన మరో 12 శక్తి టీంలను మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణకు పోలీసుశాఖ నిరంతరం పని చేస్తుందన్నారు. శక్తి టీంలు నిరంతరం కళాశాలలు, బస్టాండ్, షాపింగ్ మాల్స్, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో పహార కాస్తూ, మహిళలపై జరిగే వేధింపులను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, చిన్నారులు ఎవరైనా సరే సమస్యల్లో ఉన్నాం, అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నాం, అని శక్తి యాప్ ద్వారా సహాయం కోసం సంప్రదిస్తే తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని వారికి భరోసాగా నిలవటమే శక్తి టీంల కర్తవ్యమన్నారు. ప్రతి ఒక్కరి మొబైల్లో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు