రౌడీషీటర్లపై కొరడా | - | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్లపై కొరడా

Oct 7 2023 1:14 AM | Updated on Oct 7 2023 2:10 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి విజయవాడ: నగరంలో తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్ల భరతం పడుతున్నారు పోలీసులు. వారిని దారిలోకి తెచ్చేందుకు తమదైన శైలిలో చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని.. యాక్టివ్‌గా ఉంటూ, పోస్టింగ్‌లు పెట్టే వారిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. యువతను రెచ్చగొడుతూ తమ కార్యకలాపాలను కొనసాగించే వారిని గుర్తించి, అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రతివారం రౌడీషీటర్లకు వారి స్టేషన్ల పరిధిలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

వేగంగా చార్జ్‌ షీట్లు..
నగరంలో 373 మంది రౌడీషీటర్లు ఉండగా, 203 మందిని క్రమం తప్పకుండా పోలీసులు సంబంధించిన స్టేషన్లకు రప్పిస్తున్నారు. 28 మంది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 18 మంది వివిధ కేసుల్లో అరెస్టు అయ్యి రిమాండ్‌లో ఉన్నారు. రౌడీషీటర్‌, లా అండ్‌ ఆర్డర్‌ సస్పెక్ట్‌లు ముద్దాయిలుగా ఉన్న కేసులకు సంబంధించి త్వరిగతిన చార్జ్‌ షీట్లు వేస్తున్నారు. విచారణలో ఉన్న కేసుల్లో సాక్షులందరూ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పే విధంగా చర్యలు తీసుకొంటున్నారు. వివిధ కేసుల్లో 40 మంది రౌడీషీటర్లు, 31 మంది లా అండ్‌ ఆర్డర్‌ సస్పెక్ట్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ప్రధానంగా విచారణలో ఉన్న 43 కేసులను గుర్తించి వాటిని ఎస్‌ఐ నుంచి ఏసీపీ అధికారి వరకు ప్రత్యేకంగా అప్పగించి, విచారణలో పురోగతి ఉండేలా సీపీ టి.కె. రాణా మానిటరింగ్‌ చేస్తున్నారు.

వడపోత ఇలా..
● నగరంలో ఉన్న రౌడీ షీటర్ల జాబితా ఆధారంగా వారు అంతా ఎక్కడ ఉన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరు అవుతున్నారా లేదా పరిశీలిస్తున్నారు.

● ఐదేళ్లలో వారిపై నమోదైన కేసులు, నేర ఘటనల్లో పాత్ర వివరాలను క్రోడీకరిస్తున్నారు. ప్రధానంగా భౌతిక దాడులు, అల్లర్లు, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, గొడవలు వసూళ్ల దందాలు, వంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కార్యకలాపాలపై నిఘా పెట్టారు.

● టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రోజూ ఉదయం, సాయంత్రం 10 మంది రౌడీషీటర్లను మాత్రమే పిలిచి పూర్తి వివరాలు సేకరించి, వారి కార్యకలాపాలపై ఆరా తీసి, తనదైన శైలిలో కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది రౌడీషీటర్లు భాగస్వాములుగా ఉన్న హత్య, హత్యాయత్నం కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.

సోషల్‌ మీడియా వేదికగా...
నగర బహిష్కరణకు గురై సోషల్‌ మీడియా వేదికగా చేసుకుని తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న 50–60 మంది ప్రవర్తనను పోలీసులు నిశింతగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న యువతకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట..
​​​​​​​కమిషనరేట్‌ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. వారి కదిలికపై నిఘా ఏర్పాటు చేశాం. స్టేషన్ల వారీగా పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఇటీవల కాలంలో నమోదైన వివిధ కేసులతో సంబంధం ఉన్నవారి వివరాలను సేకరించి, వారి ప్రవర్తను ఆధారంగా తాజాగా చర్యలు తీసుకొంటున్నాం. పోలీసుల కౌన్సెలింగ్‌ తర్వాత పద్ధతి మార్చుకోని వారిపై పీడీ యాక్టును ప్రయోగించడంతోపాటు, నగర బహిష్కరణ చేస్తున్నాం. నగర బహిష్కరణకు గురై బయటి ప్రాంతాల్లో ఉండే వారిపైనా నిఘా ఉంచాం. రౌడీషీటర్లు, లా అండ్‌ ఆర్డర్‌ సస్పెక్టర్లు ముద్దాయిగా ఉన్న కేసుల విచారణ త్వరిగతిన పూర్తయి, శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. వీరిలో గణనీయమైన మార్పు దిశగా కృషి చేస్తున్నాం.
– టి.కె. రాణా, పోలీస్‌ కమిషనర్‌ ఎన్టీఆర్‌ జిల్లా

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement