భేష్‌..!

నాణ్యతా సర్టిఫికెట్‌ సాధించిన కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం - Sakshi

మన పీహెచ్‌సీలు
అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు జాతీయ స్థాయి గుర్తింపు

మెరుగైన సేవలకు గుర్తింపు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలకు గుర్తింపుగా ఎన్‌క్యూఏఎస్‌ సర్టిఫికేషన్‌ లభించింది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల్లో నాడు–నేడు పథకం ద్వారా ఆధునిక సౌకర్యాలు కల్పించడమే కాకుండా, లేబర్‌రూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాం. దీంతో ఇప్పటికే తొమ్మిది పీహెచ్‌సీలకు గుర్తింపు లభించగా, ఇప్పుడు మూడు పీహెచ్‌సీలకు లభించింది. జిల్లాలోని 22 పీహెచ్‌సీలకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

– డాక్టర్‌ మాచర్ల సుహాసిని,

డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్‌ జిల్లా

లబ్బీపేట(విజయవాడ తూర్పు): అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను ఎన్టీఆర్‌ జిల్లాలో మూడు పీహెచ్‌సీలకు, ఒక సీహెచ్‌సీకి నేషనల్‌ క్యాలిటీ ఎస్యూరెన్స్‌ స్టాండర్ట్‌ సర్టిఫికేషన్‌(ఎన్‌క్యూఏఎస్‌) లభించింది. రెండు వారాల కిందట కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ నాణ్యతా సర్టిఫికెట్‌ లభించగా, తాజాగా కొండపల్లి, ఆలూరు, పెండ్యాల పీహెచ్‌సీలతో పాటు, తిరువూరు సీహెచ్‌సీలు కూడా ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌ జిల్లాలో 12 పీహెచ్‌సీలు, ఒక సీహెచ్‌సీకి ఎన్‌క్యూఏఎస్‌ సర్టిఫికేషన్‌ లభించినట్లు అయ్యింది. కృష్ణాజిల్లాలో 51 పీహెచ్‌సీలకు గాను ఇప్పటి వరకూ 18 పీహెచ్‌సీలకు ఎన్‌క్యూఏఎస్‌ సర్టిఫికేషన్‌ సొంతమైంది. వాటిలో 11 పీహెచ్‌సీలకు గతంలోనే లభించగా, ఇటీవల బంటుమిల్లి, గుడ్డవల్లేరు, కౌతవరం, పెద అవుటుపల్లి, వెంట్రప్రగడ, చినపాండ్రాక, ఘంటసాలపాలెం పీహెచ్‌సీలకు నాణ్యతా గుర్తింపు లభించింది.

సర్టిఫికెట్లు ఎలా ఇస్తారంటే..

● జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు సర్టిఫికెట్‌ లభించాలంటే మూడు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. స్ట్రక్చర్‌, ప్రాసెస్‌(క్లినికల్‌ ప్రొటోకాల్‌), అవుట్‌ కమ్‌లను పరిశీలిస్తారు.

● అందులో భాగంగా జాతీయ కుటుంబ సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన నిపుణుల కమిటీ పీహెచ్‌సీకి వచ్చి రెండు, మూడు రోజుల పాటు అనేక కోణాలతో తనిఖీలు చేస్తారు.

● స్ట్రక్చర్‌ అంటే భవనం ఎలా ఉంది? రోగులు ఇక్కడకు వచ్చేందుకు అనువుగా ఉందా? రోగులు వేచి ఉండేందుకు గదులు ఎలా ఉన్నాయి? ఫ్యాన్‌లు వంటివి ఉన్నాయా? ఇతర సౌకర్యాలపై పరిశీలన చేస్తారు.

● రెండోది ప్రాసెస్‌–క్లినికల్‌ ప్రొటోకాల్‌ పీహెచ్‌సీకి వచ్చిన రోగులకు ప్రొటోకాల్‌ పాటిస్తున్నారా? వైద్యుడు, స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ విధులు వంటి అంశాలను పరిశీలిస్తారు.

● మూడోది అవుట్‌కమ్‌ అంటే ఓపీ రోగులు ఎంత మంది వస్తున్నారు? ఇన్‌పేషెంట్స్‌ ఎంత మంది ఉంటున్నారు? లేబర్‌ రూమ్‌, ఇతర సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే సర్టిఫికేషన్‌ ఇస్తారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో నాలుగు ఆస్పత్రులకు తాజాగా నాణ్యతా సర్టిఫికెట్లు ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌ జిల్లాలో 12, కృష్ణాలో 18 పీహెచ్‌సీలకు గుర్తింపు నాడు–నేడుతో సౌకర్యాల కల్పనతోనే సాధ్యమైందంటున్న అధికారులు

మన పీహెచ్‌సీలు సూపర్‌..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నాడు–నేడు పథకంలో పీహెచ్‌సీల రూపురేఖలు మారిపోయాయి. భవనాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడమే కాకుండా, పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియామకం చేపట్టారు. దీంతో జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ గుర్తింపు లభించిన పీహెచ్‌సీలకు ఏడాదికి రూ. 3 లక్షల చొప్పున మూడేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. మూడేళ్ల తర్వాత మరలా తనిఖీలు చేసి, అప్పుడు కూడా ఇవే ప్రమాణాలు కొనసాగితే సర్టిఫికేషన్‌ను రెన్యువల్‌ చేస్తారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top