కెరమెరి: యువతను మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పోలీసుశాఖ వినూత్న కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువకులకు ఆరో గ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి జైనూర్‌లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన 46 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయి. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జైనూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో టోర్నమెంట్ కోసం మైదానాన్ని సిద్ధం చేశారు. క్రీడాకారుల మధ్య స్నేహభావం, ఐక్యత పెంపొందించే దిశగా ఈ క్రీడోత్సవం తోడ్పడుతుందని పోలీసులు చెబుతున్నారు.
చెడు వ్యసనాలకు చెక్
కొద్దిరోజులుగా ఏజెన్సీ ప్రాంతంలోని నాలుగు మండలాల్లో గంజాయి సాగు పెరిగింది. ఇప్పటికే పలు కేసులు సైతం నమోదయ్యాయి. ఇళ్లలోనే మొక్కలు పెంచుతుండటం గమనార్హం. గాంజాకు యువత అలవాటు పడితే అనర్థాలు జరిగే అవకా శం ఉంది. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాలతో కలిగే దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించేందుకు పోలీసులు క్రీడలను సాధనంగా ఎంచుకున్నా రు. ఇందులో భాగంగా యువకులు వ్యసనాల వైపు చూడాకుండా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. సమయాన్ని క్రీడలకు కేటాయిస్తే శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతా యి. జట్టుగా ఆడటం ద్వారా నాయకత్వ లక్షణాలు, పరస్పర సహకారం, ఓటమిని స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. యువతకు ఈ అంశాలను చేరువ చేయడమే టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. అ లాగే ప్రతిభ చూపిన జట్లకు నగదు బహుమతి ప్ర దానం చేయనున్నారు. ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ రూ.3 వేలు, తృతీయ బహుమతి కింద రూ.2 వేలు అందించనున్నారు. విజేతగా నిలిచిన రెండు జట్లకు జెర్సీలు అందించనున్నారు.
మత్తుకు ఆకర్షితులు కావొద్దు..
యువత దేశానికి వెన్నెముక. వారి శక్తి సామర్థ్యాలు సరైన దిశలో వినియోగిస్తే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతో నాలుగు మండలాల క్రీడాకారులతో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నాం.
– రమేశ్, సీఐ, జైనూర్


