పులకించిన పట్నాపూర్‌ | - | Sakshi
Sakshi News home page

పులకించిన పట్నాపూర్‌

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

● ఘనంగా పూలాజీబాబా జయంతి ● తరలివచ్చిన ప్రముఖులు, భక్తులు ● బాబా సేవలను కొనియాడిన వక్తలు

కెరమెరి: జైనూర్‌ మండలంలోని పట్నాపూర్‌ పులకించింది. స్థానిక సిద్ధేశ్వర సంస్థాన్‌ సద్గురు పూలాజీ బాబా కేంద్రం ఆదివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బాబా 102వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆయన లీలా గానంతో భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వేడుకలకు వేలాది మంది భక్తులతోపాటు ప్రముఖులు హాజరయ్యారు. ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌, కలెక్టర్‌ కె.హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే సంభాజీ సర్కుండే తదితరులు హాజరై బాబాకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన సమాధిపై పూజలు చల్లి నైవేద్యం సమర్పించారు. ఎంపీ నగేశ్‌ మాట్లాడుతూ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. అనేక కుటుంబాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఆయన ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆలయ నిర్మాణానికి రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

బాబా ఆశీస్సులతో ఎదిగా..

పూలాజీబాబా ఆశీస్సులతో తాను ఎదిగానని, ఆయన చూపిన మార్గంలో నడిస్తే మంచే జరుగుతుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఆయన సేవలు ప్రశంసనీయమన్నారు. దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి ఆలయ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు అధికారులను, నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలతో సన్మా నం చేశారు. ఈ సందర్భంగా పూలాజీ బాబాపై రూపొందించిన సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇంగ్డె కేశవ్‌, సర్పంచ్‌ ఖందారే లక్ష్మి, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్‌ ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చా ర్జి అజ్మీరా శ్యాంనాయక్‌, నిర్మల్‌ బీజేపీ అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాథ్‌, ఏపీవో ఆత్రం భాస్కర్‌, డీడీ అంబాజీ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ప్రజల్లో మార్పు తెచ్చిన మహనీయుడు

తన ప్రవచనాలతో ప్రజల్లో మార్పు తెచ్చిన మహనీయుడు సద్గురు పూలాజీబాబా అని కలెక్టర్‌ హరిత, ఐటీడీఏ పీవో మకరందు అన్నారు. వాంకిడి మండలాన్ని సందర్శించినప్పుడు ఆయన సేవలను తెలుసుకున్నామని చెప్పారు. ఆయన ఆధ్యాత్మిక సేవలు ఎంతో గొప్పవని, మద్యానికి బానిసైన కుటుంబాలను బాగుచేసి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. సిద్ధేశ్వర సంస్థానాలయానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement