వ్యాపార అవసరాలకు వినియోగం అక్రమంగా అధిక ధరలకు విక్రయం కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లు గ్యాస్ దొరకక సామాన్యుల పాట్లు
కాగజ్‌నగర్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం పుణ్యానా జిల్లాలోని కొందరు వంటగ్యాస్ డీలర్ల పంట పండుతోంది. ధనార్జనే ధ్యేయంగా సా మాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నా రు. జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో ఈ తరహా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్యులు డీలర్ల కార్యాలయాలు, గోదాంల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు అక్రమార్కులు ఎక్కువ డబ్బులు చెల్లించే వారికే సిలిండర్లను సులభంగా అందిస్తున్నారనే విమర్శలున్నాయి. నెల రోజులుగా పట్టణంలోని ఆయా గ్యాస్ డీలర్ల కార్యాలయాలు, గోదాంల వద్ద సామాన్యులు పడిగాపులు కాస్తూ కనిపించడమే ఇందుకు నిదర్శనం.
యథేచ్ఛగా వినియోగం
కాగజ్‌నగర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గ్యా స్ కొరత ఉన్నా ఒక్కరోజు కూడా మూతబడకుండా కొనసాగుతున్నాయి. ఒక వైపు సామాన్యులకు ఒక్క డొమెస్టిక్ సిలిండర్ లభించని పరిస్థితి ఉంది. అయినప్పటికీ హోటళ్లు, రెస్టారెంట్లు, టీ కొట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఆశించిన స్థాయిలో డొమెస్టిక్ సిలిండర్లు పంపిణీ జరుగుతోందనే ఆరో పణలున్నాయి. రూ.980కి లభించే డొమెస్టిక్ సిలిండర్లను రూ.2వేల నుంచి రూ.2,500 వరకు హోట ళ్లు, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవి ఒక్కరోజు కూడా మూత పడకుండా కొనసాగడమే నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో యథేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు.
తనిఖీలు నామమాత్రమే!
కాగజ్‌నగర్‌లో గ్యాస్ కృత్రిమ కొరతతో ప్రజలు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంబంధిత అధి కారులు మాత్రం నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపేసుకుంటున్నారనే ఆరోణలున్నాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, రాజీవ్ చౌక్, పెట్రోల్ పంపు ఏరియాల్లో పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ల తయారీ కేంద్రా ల్లో యథేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తు న్నా వాటిపై దాడులు చేయని సంబంధిత అధికారులు చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి 3–4 డొమెస్టిక్ సిలిండర్లను జప్తు చేసి 6ఏ కింద కేసులు నమోదు చేసి చేతులు దులుపేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని జిల్లాలోని గృహ వంటగ్యాస్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
కాగజ్‌నగర్‌తో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను తమ వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. సామాన్య ప్రజలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అందించకుండా అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే డీలర్లపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. తనిఖీలు ముమ్మరం చేసి అక్రమార్కుల చర్యలను అడ్డుకుంటాం.
– మధూకర్, కాగజ్‌నగర్ తహసీల్దార్


