8x5
నిర్మల్/భైంసా/బాసర: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఓ మహాత్తర ఘట్టానికి అంకురార్పణ జరిగింది. దేశంలోనే ఏకైక సరస్వతీక్షేత్రంగా విరాజిల్లుతున్న నిర్మల్ జిల్లా బాసరను భవ్యమందిరంగా, విశాలమైన కోవెలగా తీర్చిదిద్దేందుకు ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.225 కోట్లు మంజూరు చేయడ మే కాకుండా సోమవారం స్వయంగా వచ్చి ఈ పనులకు భూమిపూజ చేశారు. రూ.200 కోట్లతో ముధోల్‌లో నిర్మించనున్న యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకూ ఇక్కడే శంకుస్థాపన చేశారు. కేవలం ఆలయం వరకే ముఖ్యమంత్రి పర్యటన పరిమితమైంది. లంచ్‌టైమ్‌లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పర్యాటక, పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
మనుమడితో అక్షరాభ్యాసం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం 11.42 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి హెలికాప్టర్‌లో బాసర చేరుకున్నారు. సీఎం భార్య గీతారెడ్డి, బిడ్డ నైమిషారెడ్డి, అల్లుడు సత్యరెడ్డి, మనుమడు రియాన్ష్ మరో హెలికాప్టర్‌లో 11.46 గంటలకు చేరుకున్నారు. సీఎం తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎకై ్సజ్, ప్రొహిబిషన్, పర్యాటకశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలకు హెలీపాడ్ వద్ద కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఆలయంలో ప్రదక్షిణ చేశారు. అమ్మవారి ఎదుట అక్షరాభ్యాస పీఠం వద్ద రేవంత్‌రెడ్డి దంపతులు తమ మనుమడు రియాన్ష్‌తో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గర్భాలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు
నిర్వహించారు. అక్కడి నుంచి పైనున్న మహంకాళీ అమ్మవారి వద్దకు వెళ్లి దర్శించుకున్నారు. వేదఆశ్వీరచన మండపంలో సీఎం కుటుంబాన్ని అర్చకులు ఆశీర్వదించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఇన్‌చార్జి ఈవో విజయరామారావు తదితరులు జ్ఞాపికలు, కండువాలతో సన్మానించారు.
లంచ్‌టైంలో మాటామంతి..
బాసర పర్యటనలో స్థానిక ఓ ప్రైవేటు రిసార్ట్‌లో లంచ్‌టైమ్‌లోనే సీఎం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈసందర్భంగా జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను కలెక్టర్ అందించగా, ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులోని అంశాలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధి అవశ్యకతను బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఆర్కియాలజీ, టూరిజం అధికారులతో మాట్లాడుతామన్నారు. కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్‌తోపాటు మహిళా సంఘాలసభ్యులు తయారు చేసిన వరికుచ్చులను సీఎంకు జ్ఞాపికలుగా అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బాసర పర్యటనను విజయవంతం చేసినందుకు స్థానిక గ్రామస్తులు, సహకరించిన భక్తులకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల ధన్యవాదాలు తెలిపారు.
ఘనంగా భూమిపూజ..
బాసర ఆలయంలోని తూర్పు ద్వారం పక్కన పునరాభివృద్ధి పనులకు ము ఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్‌తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు నగేశ్, వేంనరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, డీసీసీ చీఫ్, ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్, ఎమ్మెల్సీలు దండె విఠల్, చిన్నమైల్ అంజిరెడ్డి, నిర్మల్, భైంసా మున్సిపల్ చైర్మన్లు అప్పాల కావ్యగణేశ్‌చక్రవర్తి, తూమోల్ల దత్తాద్రి, బాసర సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావుపటేల్, రేఖానాయ క్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీ సీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తదితరులతో కలిసి భూమిపూజను అట్ట హాసంగా నిర్వహించారు. ఇక్కడే ముధోల్‌లో నిర్మించే యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ట్రిపుల్‌ఐటీ, యూనివర్సిటీ ఊసే లేదు..
సీఎం రేవంత్‌రెడ్డి బాసర పర్యటనలో అందరూ ఊహించిన
ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల సమస్యలు, యూనివర్సిటీ ఏర్పాటు గురించి ఎక్కడా చర్చ రాకపోవడం గమనార్హం.
ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్న ఆర్జీయూకేటీ గురించి మాట్లాడుతారని, జనవరి 16న నిర్మల్‌సభలో ప్రకటించిన జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఆలయ అభివృద్ధి మినహా ఈ రెండు ప్రముఖ అంశాలకు సీఎం పర్యటనలో ప్రాధాన్యత
దక్కకపోవడం జిల్లావాసులను నిరాశపర్చింది.


