ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై అర్జీలు అందించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన బేతి సునంద, రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన కమిటె శంకర్, వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం చోర్‌పల్లి గ్రామానికి చెందిన కొమ్ము విజయ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఓపెన్ కాస్టు ప్రభావంతో భూమి కోల్పోతున్న తనకు పరిహారం అందించాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన జాదవ్ రోహిదాస్ విన్నవించారు. నిషేధిత జాబితా నుంచి తన పట్టా భూమిని తొలగించాలని తిర్యాణి మండలం గంభీరావ్‌పేటకు చెందిన లింగంపల్లి చిన్నమ్మ అర్జీ అందించింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం నారాయణపూర్‌కు చెందిన మన్నెంపల్లి అరుణ, కౌటాల మండలం గురుడుపేటకు చెందిన చల్ల లక్ష్మి వేర్వేరుగా దరఖాస్తులు అందించారు.
గాలివానకు ఇల్లు నేలమట్టం
ఇటీవల గాలివానకు ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యింది. పేద కుటుంబం కావడంతో అద్దె ఇంట్లో ఉండాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలి.
– పోగుల లక్ష్మి, టీఆర్‌నగర్, ఆసిఫాబాద్
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా..
చింతలమానెపల్లి శివారులోని సర్వే నం. 59/17లో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. కొత్త పట్టా పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబంధు రావడం లేదు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టర్ చొరవ చూపి కొత్త పట్టాపాస్ పుస్తకం ఇప్పించాలి.
– మానెపల్లి శంకర్, చింతలమానెపల్లి
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
గతంలో పలుమార్లు ఇందిరమ్మ ఇంటి కోసం ద రఖాస్తు చేసుకున్నా. ఆన్‌లైన్‌లో ఇల్లు మంజూరైనట్లు చూపుతున్నా సంబంధిత అధికారులు మాకు రాలేదని చెబుతున్నారు. సొంత స్థలం ఉన్నా.. ఇల్లు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– అంకిత, ఎడవెల్లి, మం.రెబ్బెన
పీవోపీ నుంచి తొలగించాలి
కెరమెరి మండలం సాంగ్వి శివారులోని సర్వే నం.25లో నాలు గెకరాల వ్యవసాయ భూమి ప్రొహిబిషన్(పీవోపీ)లో ఉంది. ప్రస్తుతం రైతుబంధు, రుణ సదుపాయం పొందుతున్నాను. పీవోపీలో ఉంటే భవిష్యత్తులో విక్రయించడం కుదరదు. అధికారులు సర్వే చేసి పీవోపీ జాబితా నుంచి భూమిని తొలగించాలి.
– సంతోష్, సాంగ్వి, మం.కెరమెరి


