రక్షణతో కూడిన పనికి ప్రాధాన్యత
రెబ్బెన(ఆసిఫాబాద్): బొగ్గు ఉత్పత్తిలో కాస్త ఆలస్యమైనా రక్షణతో కూడిన పనికి ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీహెచ్‌పీలో తనిఖీ బృందం పర్యటించింది. కన్వీనర్ కృష్ణమూర్తి సారథ్యంలో రక్షణ తనిఖీ బృందం జీఎంతో కలిసి సీహెచ్‌పీని పరిశీలించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణిలోనే గోలేటి సీహెచ్‌పీ ఉత్తమమైందని, బొగ్గు రవాణా, సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. ప్రతీ ఉద్యోగి రక్షణ విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దన్నారు. అనంతరం కళాకారులు పాటలు, నాటిక ద్వారా రక్షణ ప్రాముఖ్యతను వివరించారు. గాయపడిన వారికి సీపీఆర్, ప్రథమ చికిత్స చేసే విధానంపై అవగాహన కల్పించారు. తనిఖీ బృందం సభ్యులు ట్రేడ్ టెస్ట్ విజేతలకు బహుమతులు ప్రదానంగా చేశారు. అలాగే డీవైసీఎంవో రమేశ్‌బాబు ఆధ్వర్యంలో మరో తనిఖీ బృందం బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రితోపాటు గోలేటి డిస్పెన్సరీని సందర్శించి రక్షణ చర్యలు పరిశీలించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా రక్షణాధికారి కె.రాజమల్లు, సీహెచ్‌పీ హెచ్‌వోడీ కోటయ్య, రక్షణ తనిఖీ బృందం సభ్యులు గాబ్రియల్ రాజు, స్టాలిన్ బాబు, ఏజీ శివప్రసాద్, హనుమాన్‌గౌడ్, సంతోష్‌కుమార్, ఫిట్ కార్యదర్శి రామయ్య పాల్గొన్నారు.


