సరిహద్దులో సమరం
తెలంగాణ, మహారాష్ట్ర పాలనలో 15 గ్రామాలు
నేడు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ప్రజల డిమాండ్
కెరమెరి(ఆసిఫాబాద్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 15 వివాదాస్పద గ్రామాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు పంచాయతీలు, 31 వార్డుల్లోని ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు అక్కడ అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోళి, అంతాపూర్, భోలాపటార్, ముకంగూడ పంచాయతీలు ఏళ్లుగా తెలంగాణ, మహారాష్ట్ర పాలనలో కొనసాగుతున్నాయి. ఆయా పంచాయతీల్లో పరంధోళి, కోటా, పరంధోళి తాండ, శంకర్‌లొద్ది, లేండిజాల, మహరాజ్‌గూడ, ముకదంగూడ, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయాణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరీ గ్రామాలు ఉన్నాయి. సుమారు 1520 కుటుంబాలు ఉండగా.. 5875 జనాభా ఉంది. 3,456 మంది ఓటర్లు ఉన్నారు. ఏళ్లుగా వివాదాలు పరిష్కారం కాకపోవడంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు రెండు రాష్ట్రాలకు చెందిన ఓటుహక్కు కలిగి ఉన్నారు.
అన్నీ డబుల్
రెండు ప్రభుత్వాల పాలన ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇద్దరేసి ప్రజాప్రతినిధులు ఉండటంతోపాటు రెండు రాష్ట్రాలకు చెందిన రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు అందించారు. తెలుగు, మరాఠీ మీడియాలకు చెందిన పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇరు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే అనేక గ్రామాల్లో పక్కా గృహాలు మంజూరు కాలేదు. గతేడాది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నాలుగు పంచాయతీలకు ఒక్కో ఇల్లు చొప్పున మంజూరు చేశారు. దీంతో అక్కడి ప్రజలు పెంకుటిళ్లు, రేకుల ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. అంతేకాక సాంకేతిక యుగంలోనూ వారికి మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందడం లేదు. ఆయా గ్రామాల్లో 70 శాతం మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. రెవెన్యూ, అటవీశాఖ మధ్య వివాదాలతో వారి భూములకు పట్టాలు లేవు. 2016 నుంచి పహనీలు కూడా నిలిచిపోవడంతో బ్యాంకు రుణాలు అందడం లేదు. ఫలితంగా వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్రి వాగుపై రెండేళ్ల క్రితం వంతెన నిర్మించినా రోడ్డు పనులు వదిలేశారు. ఉమ్రి నుంచి పరంధోళికి సుమారు నాలుగు కిలోమీటర్ల మేర కంకర తేలి అధ్వానంగా మారింది.
ఓటర్ల వివరాలు
పంచాయతీ ఓటర్లు
అంతాపూర్ 815
బోలాపటార్ 1,007
పరంధోళి 873
ముకదంగూడ 761
సరిహద్దులో సమరం


