పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కెరమెరి(ఆసిఫాబాద్): పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణ సక్రమంగా పర్యవేక్షించాలన్నారు. సరిపడా కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేయాలని, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెంట్లు మినహా మిగిలిన వారిని కేంద్రాల్లోకి అనుమతించొద్దన్నారు. సిబ్బందికి అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు, ఎంపీడీవో సురేశ్, తహసీల్దార్ సంతోష్, ఎంఈవో ఆడే ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలను అతిక్రమిస్తే చర్యలు
కెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండల కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం, ప్రలోభాలు, బెదిరింపులు.. వంటి చర్యలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండొద్దని సూచించారు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు రమేశ్, విద్యాసాగర్, బుద్దె రవీందర్, ఎస్సైలు గంగన్న, రవికుమార్, మధుకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి


