సరిహద్దులో ప్రశాంతంగా పోలింగ్
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో గల 15 వివాదాస్పద గ్రామాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతాపూర్, పరంధోళి, భోలాపటార్, ముకదంగూడ పంచాయతీల ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఇక్కడ 3,456 మంది ఓటర్లు ఉండగా 2,746(79.4శాతం) మంది ఓటు వేశారు. మహరాష్ట్రలోని చిక్లి, పాటగూడ, కుంభేఝరి గ్రామాలకు చెందిన సుమారు 56 ఓటర్లు బోలాపటార్ పంచాయతీలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరంతా గతంలో ఓటు వేయలేదు. సదరు పంచాయతీకి చెందిన గ్రామాల్లో పొలాలు ఉన్నాయని, ఇక్కడే ఆధార్ కార్డు ఉందని చెబుతున్నారు.
దూర భారం
లేండిగూడ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు, ఎసాపూర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం నడిచి ఓటర్లు బోలాపటార్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనేక మంది చిన్నారులను భుజాన ఎత్తుకుని కాలినడకన వచ్చారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు. సరైన సమయానికి పోల్ చీటీలు అందలేదు. బీఎల్‌వోలు కేంద్రాల వద్ద పోల్ చీటీలు అందించారు. కేంద్రాల వద్ద, ప్రధాన మార్గాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బోలాపటార్‌లో బారులుతీరిన ఓటర్లు
లేండిగూడ నుంచి కాలినడకన వస్తున్న ఓటర్లు
పోలింగ్ వివరాలు
పంచాయతీ ఓటర్లు పోలైనవి శాతం
అంతాపూర్ 815 656 85.5
బోలాపటార్ 1007 801 79.54
పరంధోళి 873 692 79.2
ముకదంగూడ 761 597 78.4
మొత్తం 3,456 2,746 79.4
సరిహద్దులో ప్రశాంతంగా పోలింగ్


