ఎస్టీపీపీలో మరో ప్లాంట్
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలో 800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి కొత్త విద్యుత్ ప్లాంటు నిర్మిస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంనాయక్ తెలిపారు. ఇందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎస్టీపీపీ(సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్)ను ప్లాంట్ ఈఅండ్‌ఎం తిరుమల్‌రావుతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈడీ చిరంజీవి, జీఎంలు నరసింహారావు, మదన్‌మోహన్ సీఎండీకి స్వాగతం పలికారు. అనంతరం బలరాం నూతనంగా నిర్మించే ప్లాంట్ ప్రదేశంతోపాటు ప్లాంట్‌లో నూతనంగా చేపట్టిన మిథనాల్ ప్లాంట్ ట్రయల్ రన్‌ను పరిశీలించారు. ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇందారం ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున బొగ్గు, ఓబీ వార్షిక లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎండీ వెంట ఎస్‌ఓటూ జీఎం సత్యనారాయణ, పీవో వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు హరినారాయణ, రాజన్న, జక్కారెడ్డి ఉన్నారు.


