పరిహారం రాలే..
దహెగాం: నాలుగేళ్లుగా వరదల కారణంగా పంట నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందడంలేదు. జిల్లాలో ఏటా భారీ వర్షాలకు వాగు లు, ప్రాణహిత నది ఉప్పొంగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. గతేడాది మాత్రమే వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినా పూర్తి స్థాయిలో అందలేదన్న ఆరోపణలున్నాయి. ఈ వానాకాలంలోనూ భారీ వర్షాలకు పెద్దవాగు, ఎర్రవాగు, ప్రాణహిత నది ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు చోట్ల వరదకు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో రైతులు 3.45 లక్షల ఎకరాల్లో పత్తి, 60వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొదట వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. జూలై చివరి వారం నుంచి ఆగస్టు దాకా భారీ వర్షాలు కురిశాయి. ఆగస్టు రెండో వారంలో భారీ వర్షాలు కురవగా పెద్దవాగు, ఎర్రవాగు ఉప్పొంగాయి. ప్రాణహిత కూడా ఉప్పొంగడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాణహిత పరీవాహక ప్రాంతా లైన కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం, చింతలమానెపల్లి మండలాల్లో పంటలు నీట ముని గాయి. పెద్దవాగు పరీవాహక ప్రాంతాలైన పెంచికల్‌పేట్, దహెగాం, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మండలాల్లో పంటలు నీట మునగడంతోపాటు పలుచోట్ల కొట్టుకుపోయాయి. కొన్ని మండలాల్లో భూములు కోతకు గురై సాగుకు పనికి రాకుండా పోయాయి. జిల్లాలో నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది.
అమలులో లేని ఫసల్ భీమా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అతివృష్టి, అనావృష్టి సమయాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో ఈ పథకాన్ని నిలిపివేయడంతో రాష్ట్రంలో అమలులో లేదు. దీంతో రైతుల పంటల కు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి ఈ ఖరీఫ్‌లో పంట నష్టపోయిన తమకు పరిహా రం మంజూరు చేసి ఆదుకోవాలని జిల్లాలోని బాధిత రైతులు వేడుకుంటున్నారు.


