● ప్రారంభమైన కాల్వ పనులు ● నెలలోగా సత్తుపల్లి, వేంసూరుకు గోదావరి జలాలు ● సాగునీటికి ఢోకా ఉండదని రైతుల్లో హర్షాతిరేకాలు
సత్తుపల్లి: సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు అందించాల్సిన సీతారామ ప్రాజెక్టు పరిధి కాల్వ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు 1.7 కి.మీ. మేర కాల్వ నిర్మాణానికి 74 భూమి అవసరం కాగా, 52 ఎకరాలకు సంబంధించి రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆరు నెలలుగా పనులకు బ్రేక్ పడింది. పరిహారం విషయంలో పలుమార్లు చర్చించి.. ప్రభుత్వం నుంచి హామీ ఇప్పించి కేసుల ఉపసంహరణకు ఒప్పించడంతో మళ్లీ పనుల్లో కదలిక వచ్చింది. దీంతో దమ్మపేట మండలం నాగుపల్లి 40.3 కి.మీ. వద్ద నిలిచిపోయిన సీతారామ కాల్వ పనులు బుధవారం మొదలయ్యాయి. ఒకేసారి తొమ్మిది పొక్లెయినర్లతో రెండు వైపులా నుంచి పనులు చేపడుతుండగా.. నెలలోగా కాల్వ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
400 క్యూసెక్కులు.. 24 గంటలే
బేతుపల్లి చెరువుకు 400 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేస్తే 42 కి.మీ. ప్రయాణించి 24 గంటల్లో చేరుకునేలా కాల్వలను డిజైన్ చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీ.జీ.కొత్తూరు పంప్ హౌస్ వద్ద నీరు విడుదల చేస్తే ములకలపల్లి మండలం వీ.కే.రామవరం(పూసుగూడెం), కమలాపురం పంప్ హౌస్ మీదుగా తొట్టిపంపు డెలివరీ సిస్టం నుంచి యాతాలకుంట టన్నెల్, బుగ్గపాడు, నాగుపల్లి వద్ద బేతుపల్లి బ్రాంచ్ కెనాల్ క్రాస్ రెగ్యులేటరీ, ఆపై శ్రీరాంపురం చెరువు అలుగు పోసుకొని ముసలిబంధం, ఆసన్నగూడెం, మల్లెపూల వాగు మీదుగా గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరతాయి. ఇప్పటికే మార్గమధ్యలో అవసరమైన రెగ్యులేటరీ, తూము నిర్మాణం కూడా పూర్తయింది.
సత్తుపల్లి, వేంసూరు మండలాలకు..
గోదావరి జలాలు బేతుపల్లికి చెరువుకు చేరితే సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో జలకళ సంతరించుకుంటుంది. బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ ద్వారా వేంసూరు మండలంలోని 46 చెరువులకు గాను 10వేల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు కుడి, ఎడమ కాల్వలతో రామానగరం, తాళ్లమడ, బేతుపల్లి, కిష్టాపురం, నారాయణపురం, తుంబూరు గ్రామాల్లో అధికారికంగా 4,800 ఎకరాలకు, అనధికారికంగా మరో ఆరు వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఓ వైపు సీతారామ కాల్వతో గోదావరి జలాలతో చెరువులు నింపుతూ మరోవైపు బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ ద్వారా సాగునీరు డిశ్చార్జ్ చేసేలా డిజైన్ చేశారు.
మంత్రి తుమ్మల ప్రత్యక్ష పర్యవేక్షణ
డిసెంబర్ వరకు మాత్రమే గోదావరిలో నీరు అందుబాటులో ఉండే అవకాశముంది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని రైతులకు మెరుగైన పరిహారం అందేలా సీఎం రేవంత్రెడ్డితో చర్చించారు. ఫలితంగా రైతులు కోర్టు కేసుల ఉపసంహరణకు అంగీకరించడంతో 1.7 కి.మీ. మేర కాల్వ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈక్రమాన నవంబర్ నెలఖారు కల్లా కాల్వ నిర్మాణం పూర్తి చేసి, గోదావరి జలాలను బేతుపల్లి చెరువుకు తరలించే లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. గోదావరి జలాలు చేరితే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడమే కాక ఆయకట్టులో పంటల సాగు సాఫీగా సాగనుంది.


