వీలైనంత త్వరగా కూల్చాలని ఆదేశించాం
● బడుల్లో శిథిల గదుల తొలగింపునకు నిర్ణయం ● గ్రామ పాలకవర్గాల సహకారంతో పనులు చేయించాలని సూచన
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు శిథిలావస్థకు చేరాయి. ఇవి ఇలాగే వదిలేస్తే కూలిపోయి విద్యార్థులు ప్రమాదం బారిన పడే అవకాశముంది. ఈమేరకు ప్రస్తుత దసరా సెలవుల్లో తొలగింపునకు కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లను పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన నివేదికతో కూల్చాల్సిన వాటిని గుర్తించారు.
169 తరగతి గదులు
జిల్లాలోని 21మండలాల పరిధి 140 పాఠశాలలను అధికారులు పరిశీలించారు. ఇందులో 121 పాఠశాలల్లోని 169 తరగతి గదులు శిథిలావస్థకు చేరినట్లు తేల్చారు. మరో 27 గదులకు చిన్నపాటి మరమ్మతులు చేస్తే ఉపయోగించుకోవచ్చని ఇంజినీరింగ్ అధికారులు నివేదిక సమర్పించారు. అంతేకాక 15 మరుగుదొడ్లు, 19 కిచెన్ షెడ్లు శిథిలం కాగా.. విద్యార్థుల భద్రతకు ఇబ్బంది ఏర్పడకముందే తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు గుర్తించిన గదులను స్థానిక సర్పంచ్ల సహకారం, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కూల్చివేయించాలని ఎంఈఓలు, హెచ్ఎంలకు విద్యాశాఖ సూచనలు చేసింది. తొలగింపు పూర్తయ్యాక నివేదికను సమర్పించాలని సూచించారు.
శిథిలావస్థలో ఉన్న పాఠశాలల్లోని తరగతి గదులు, కిచెన్, మరుగుదొడ్లను కూల్చాలని నిర్ణయం తీసుకున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్ల సహకారంతో వీలైనంత త్వరగా కూల్చివేయించాలని హెచ్ఎంలకు సూచించాం. దసరా సెలవుల్లోనే పనులకు అనువుగా ఉంటుందని చెప్పాం.
– డి.వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారి


