ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈమేరకు నాలుగో రోజైన బుధవారం తెల్లవారుజామునే శ్రీవారికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత యాగశాలలోని శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పూజలు, హోమం జరిపించాక అలివేలు మంగ అమ్మవారిని శ్రీ మహా చండీదేవి అవతారంలో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకోగా అన్నదానం ఏర్పాటుచేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు
ఖమ్మం సహకారనగర్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్నారు. ఈమేరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్‌టికెట్లను http://bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈఓ డి.వాసంతి తెలిపారు. పరీక్ష వచ్చేనెల 1న ఉదయం 9–30 నుంచి 12–30 గంటల వరకు జరగనుండగా, ఖమ్మంలో ఐదు, కల్లూరులో రెండు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు.
బాలికలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి
ఖమ్మంలీగల్: బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్ఎస్ఏ) కార్యదర్శి దేవీమానస సూచించారు. ఖమ్మంలోని బాలల సదన్‌లో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవ సమావేశంలో ఆమె అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బాలికలు విద్యార్థి దశలోనే లక్ష్యాలను ఎంచుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. బాలికలకు సమాన అవకాశాల కల్పన, హక్కులు, భద్రతను పరిరక్షించడంతో పాటు బాల్య వివాహాల కట్టడికి అందరూ పాటుపడాలని సూచించారు. అవసరమైన వారికి డీఎల్‌సీఏ ద్వారా ఉచిత న్యాయసాయం అందిస్తామని తెలిపారు. అనంతరం బాలికలకు పుస్తకాలు, క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణువందన, బాలల సదన్ సూపరింటెండెంట్ నవ్య తదితరులు పాల్గొన్నారు.
సమాన అవకాశాలతో బాలికల భవిష్యత్‌కు బాటలు
ఖమ్మం వైద్యవిభాగం: బాలికలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎంసీహెచ్‌లో ఆడపిల్లలకు జన్మనిచ్చిన బాలింతలకు ఆమె కిట్లు అందజేసి మాట్లాడారు. ఆడపిల్లల జననాన్ని గౌరవిస్తూ వారిపై సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, సంరక్షణ, విద్య, ఆరోగ్యం, సాధికారతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. డీడబ్ల్యూఓ పాలేటి ప్రమీల, డీఎంహెచ్ఓ రామారావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరేందర్‌తో పాటు ఉద్యోగులు ఎస్.డీ.సమ్రీన్, పి.ప్రమీల, ఆర్.వాసంతి, కె.సతీష్, కొమినేని బాబు, ఎన్.ముత్తయ్య పాల్గొన్నారు.


