ఇటీవలే కండక్టర్ మృతి
రీజియన్‌లో కండక్టర్లు, డ్రైవర్ల వివరాలు
(రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ కలిపి)
ఆరు నెలలుగా అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి
బీపీ, షుగర్ పరీక్షలు కూడా కరువే..
12 – 16 గంటల సుదీర్ఘ విధులతో ఒత్తిడి
సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షణను
వదిలేసిన యాజమాన్యం
ఖమ్మం మయూరిసెంటర్: విధినిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఆరోగ్యంపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే సిబ్బందికి గతంలో క్రమం తప్పక వైద్య పరీక్షలు నిర్వహించేవారు. కానీ గత ఐదారు నెలలుగా కనీసం బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించకపోవడంతో పనిభారంతో సతమతమయ్యే ఉద్యోగులు ఏ క్షణాన ఏం జరుగుతోందనని ఆందోళన చెందుతున్నారు.
హెల్త్ వలంటీర్ల వ్యవస్థకు గ్రహణం
సిబ్బంది, అధికారుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు గతంలో ప్రతీ డిపోలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేసేవారు. దీనికోసం వైద్య రంగంపై అవగాహన ఉన్న కండక్టర్లు, డ్రైవర్లను హెల్త్ వలంటీర్లుగా ఎంపిక చేశారు. రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి డిపోకు ఇద్దరి చొప్పున 14 మందికి శిక్షణ ఇచ్చి వలంటీర్లుగా నియమించారు. వీరు తమ రోజువారీ విధులతో పాటు నెలకోసారి సిబ్బందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఆ నివేదికలను తార్నాక ఆస్పత్రి వైద్యులతో పాటు ఎండీకి పంపించేవారు.
వెలుగులోకి ఆందోళనకర అంశాలు
ప్రారంభంలోనే రీజియన్‌లో 10 మందికి పైగా తీవ్ర రక్తపోటు(హై బీపీ) ఉన్నట్లు గుర్తించి, వారిని రీజియన్‌లోని డిస్పెన్సరీలకు రిఫర్ చేశారు. ఆతర్వాత తార్నాక ఆస్పత్రికి పంపించి ప్రత్యేక చికిత్స ద్వారా ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. గత ఐదారు నెలలుగా పరీక్షలు లేకపోవడం, వలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టడంతో సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది.
రద్దీ, పనిభారం
ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లోరద్దీ విపరీతంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా సర్వీసులు నడపాల్సి రావడం, ఆపై సిబ్బంది కొరత కారణంగా ఓవర్ టైం(ఓటీ) డ్యూ టీలు వేస్తుండటంతో డ్రైవర్లు, కండక్టర్లపై పని భారం రెట్టింపైంది. గతంలో 8 – 10గంటల్లో ముగిసే డ్యూటీ ఇప్పుడు కనీసం 12గంటలకు చేరింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల సిబ్బంది 14 – 16గంటల పాటు విధుల్లోనే గడపాల్సి వస్తోంది. సుదీర్ఘ సమయం చేయడం, ప్రయాణికుల ఒత్తిడి తట్టుకోవడం వల్ల పలువురు బీపీతో సమస్య ఎదుర్కొంటున్నారు.
డిపోల్లో హెల్త్ చెకప్‌లు నిలిచిపోవడం, ఒత్తిడి పెరగడంతో పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో ఇటీవల జరిగిన ఒక ఘటన తెలియజేస్తోంది. ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ హై దరాబాద్ విధులకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా బీపీ పెరిగి గుండెపోటు వచ్చింది. దీంతో ఎంజీబీఎస్‌లో బస్సులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత రీజియన్ పరిధిలోని సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై అధికారులను వివరణ కోరగా.. డిపోల్లో హెల్త్ వలంటీర్‌లు ఉన్నారని, అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం డిస్పెన్షనరీల్లో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.
డిపో కండక్టర్లు డ్రైవర్లు
ఖమ్మం 229 188
మధిర 120 86
సత్తుపల్లి 162 138
భద్రాచలం 135 202
కొత్తగూడెం 104 90
మణుగూరు 138 132
ఇల్లెందు 68 86
మొత్తం 956 922
కార్మికుల ఆరోగ్య పరీక్షలకు బ్రేక్


