గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఢీకొన్న లారీలు..
నిఘా నీడలో గ్రీన్‌ఫీల్డ్ హైవే..
ఖమ్మం–దేవరపల్లి హైవేపై హై రిజల్యూషన్ కెమెరాలు
కిలో మీటర్‌కు ఒక కెమెరా చొప్పున ఏర్పాటు
టోల్ ప్లాజాల్లో కంట్రోల్ రూమ్‌లు
ఏఐ టెక్నాలజీతో పర్యవేక్షణ..
వైరా: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి 365 బీజీపై అధికారులు నిఘాను పటిష్టం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పర్యవేక్షణలో దాదాపు ఒక కిలో మీటర్ పొడవున వాహనాల రాకపోకలను పసిగట్టేలా ప్రతీ కిలో మీటర్‌కు ఒక హై రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
నిరంతర నిఘా..
జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన కెమెరాలు 24/7 పని చేస్తుండడంతో హైవేపై ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్‌లో ఇట్టే తెలిసిపోతోంది. ప్రమాదాలకు కారణమైన వాహనాలు కాని, గంజాయి రవాణా చేస్తున్న వాహనాలు కాని ఇక తప్పించుకునే అవకాశం ఉండదు. ఇటీవల ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయిని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కూడా తరలిస్తుండడంతో హై రిజల్యూషన్ కెమెరాల ద్వారా వాహనాలను ఇట్టే పసిగట్టి అధికారులకు సెల్‌ఫోన్‌లోనే సమాచారం అందించే టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అంతేకాక వాహన వేగ పరిమితి గంటకు 80 కి.మీ. నుంచి 100 కి.మీ వరకు వేగం దాటకుండా వాహనదారులు జాగ్రత్త పడే అవకాశం ఉంది.
10 టోల్ ప్లాజాలు, 5 కంట్రోల్ రూమ్‌లు..
టోల్ ప్లాజాల వద్ద కెమెరాల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి నుంచి జిల్లా సరిహద్దు ప్రాంతమైన చింతగూడెం వరకు 105 కి.మీ. మేర ఉండగా తెల్దారుపల్లి, వైరా, లింగాల, చింతగూడెం వరకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 10 టోల్ ప్లాజాలు, 5 కంట్రోల్ రూమ్‌లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో ఎక్కడ ఏమి జరిగిన వెంటనే అధికారులకు తెలిసిపోతుంది.
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు..
ఖమ్మం సమీపంలో తెల్దారుపల్లి నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు 165 కి.మీ. పొడవున కి.మీకు ఒక కెమెరా చొప్పున ఏఐ టెక్నాలజీతో 125 హై రిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణలో 105, ఆంధ్రాలో 60 కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ టోల్ ప్లాజా వద్ద కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి రాత్రి వేళలో సైతం కెమెరాలు కనిపించేలా సోలార్ ప్యానళ్లు వాటికి అనుసంధానం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఎక్కడా వైర్లు, కేబుళ్లు వంటివి కనిపించకుండా, ఎలాంటి అటంకాలకు ఆస్కారం లేకుండా వీటిని ఏర్పాటు చేయడం విశేషం.
వైరా: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వైరా మండలం సోమవరం టోల్ గేట్ వద్ద మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఘటనలో వెనక లారీడ్రైవర్, హైదరాబాద్‌కు చెందిన ఎండీ.ఖలీమ్ గాయపడడంతో 108 సిబ్బంది ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం నుంచి చింతగూడెం వరకు నిర్మించిన హైవేపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. నిత్యం గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై వెళ్లే ప్రతీ వాహనాన్ని పర్యవేక్షిస్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించేలా రహదారి సిబ్బందిని ఏర్పాటు చేశాం. హైవేపై బైక్‌లు, ఆటోలకు అనుమతి లేదు. – రెడ్డిరామ్,
అసిస్టెంట్ మేనేజర్, గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి


