వైరా: వైరా 9వ వార్డుకు చెందిన సంగెపు లక్ష్మీసాహితి డీఎస్పీగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఏడాది పాటు శిక్షణ పొందగా సోమవారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. నెల పాటు గ్రేహౌండ్స్‌లో శిక్షణ అనంతరం ప్రొబేషనరీ డీఎస్పీగా మెదక్ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, కవిత, కుటుంబ సభ్యులు ఆమెను అభినందించారు.
పంటల సస్యరక్షణపై
అవగాహన
తిరుమలాయపాలెం: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి మధుసూదన్ సూచించారు. తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని మిర్చి, టమాటా పంటలను మంగళవారం ఆయన పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. అవసరాల ఆధారంగా నీటి తడులు అందించాలే తప్ప వృథా చేయొద్దని తెలిపారు. అంతేకాక చీడపీడలు, తెగుళ్లను గమనించాలని సూచించారు. పాలేరు ఉద్యాన అధికారి అపర్ణ పాల్గొన్నారు.
రేక్ పాయింట్‌కు యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు ఎంఎఫ్‌ఎల్ కంపెనీకి చెందిన 1,462.50 మెట్రిక్ టన్నుల యూరి యా మంగళవారం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 562.50 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేసినట్లు డీఏఓ డి.పుల్లయ్య తెలిపారు. మరో 100 మె.టన్నులను బఫర్ స్టాక్ నిల్వ చేశామని వెల్లడించారు.
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రత
ఖమ్మంక్రైం: జిల్లాలోని బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతపై దృష్టి సారించాలని సీపీ సునీల్‌దత్ సూచించారు. పోలీస్, బ్యాంకుల అధికారులతో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆర్థిక నేరాలు పెరుగుతున్నందున సెక్యూరిటీ గార్డ్‌లను నియమించడంతో పాటు సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటుచేయాలని తెలిపారు. అడిషనల్ డీసీపీ రామానుజం, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవిప్రసాద్, ఏసీపీలు పాల్గొన్నారు.
ఉచితంగా కేన్సర్ స్క్రీనింగ్
కామేపల్లి: కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేలా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యాన జిల్లాలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ముత్యాల లాలయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ముత్యాల రామయ్య–విమలాదేవి తెలిపారు. ఈనెల 15న కామేపల్లి మండలం పండితాపురం, 16న ఏన్కూర్ మండలం టి.లింగన్నపేట, 17న వైరా, 18న మధిర క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరాల్లో నిపుణులైన వైద్యులు పాల్గొని పరీక్షలు చేస్తారని తెలిపారు.
మెరిట్ జాబితా విడుదల
ఖమ్మం వైద్యవిభాగం: కాంట్రాక్టు విధానంలో బస్తీ దవాఖానా వైద్యాధికారి, స్టాఫ్‌నర్స్‌లను ఎంపిక చేయనుండగా, ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండే జాబితాను పరిశీలించి అభ్యంతరాలపై లిఖితపూర్వక దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. గడువు తర్వాత వచ్చే దరఖాస్తులు అనుమతించబోమని తెలిపారు.
అప్పుల బాధతో ఆత్మహత్య
కొణిజర్ల: పాల వ్యాపారం చేసే వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని పల్లిపాడుకు చెందిన సుకాసి పాపారావు (41) ముప్పై పాడి గేదెలు కొనుగోలు చేసి పాల వ్యాపారం చేస్తున్నాడు. ఆపై గేదెల దాణా కోసం కొంత భూమి తీసుకుని, అందుకోసం అప్పులు చేశాడు. అప్పుల భారం పెరగడంతో కొన్నాళ్లుగా చనిపోతానని చెబుతుండగా తల్లి సరోజిని, సోదరుడు సర్దిచెప్పారు. ఈక్రమాన 12వ తేదీన తల్లి కొణిజర్ల వెళ్లగా రాత్రి 7 గంటలకు పాపారావు పల్లిపాడు సెంటర్‌కు వెళ్లి వచ్చి ఇంటి ముందు పడిపోయాడు. నోటి నుంచి నురగలు వస్తుండడంతో సహజీవనం చేస్తున్న మహిళ ఇచ్చిన సమాచారంతో వైరాలోని ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఘటనపై ఆయన తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూరజ్ తెలిపారు.
మహిళ అదృశ్యంపై కేసు
ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ మహిళ కానరాకుండా పోవడంపై కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నల్లగొండ జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన ఎలమకంటి లక్ష్మి(38) తన భర్త బాలకృష్ణతో కలిసి బతుకమ్మ పండుగకు ఈనెల 12న ఖమ్మం బయలుదేరింది. మార్గమధ్యలో దంపతులు గొడవ పడగా, ఖమ్మం చేరుకోగానే ఎవరికీ చెప్పకుండా లక్ష్మి వెళ్లిపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో బంధువుల ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం వన్‌టౌన్ ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.


