పాము కాటుతో వ్యవసాయ కూలి మృతి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుతో వ్యవసాయ కూలి మృతి

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

బిహార్‌ కార్మికుడు.. చికిత్స పొందుతున్న వ్యక్తి..

తల్లాడ: పొట్ట కూటి కోసం పొలం పనికి వెళ్లిన ఓ మహిళ పాము కాటుతో మృతి చెందింది. వివరాలిలా.. తల్లాడ మండలం తెలగవరం గ్రామానికి చెందిన తేళ్లూరి వాణి(35) మరో పది మందితో కలిసి మంగళవారం సర్పంచ్‌ భూక్యా కాళోజి చేనులో పత్తి తీసేందుకు వెళ్లింది. ఈక్రమాన పత్తి తీస్తుండగా గడ్డి కింద ఉన్న పాము వాణిని కాటేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరగా కల్లూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అయిన ఆమె భర్త వెంకటేశ్వర్లు పనుల్లో భాగంగా నిజామాబాద్‌ వెళ్లగా ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

తిరుమలాయపాలెం: మండలంలోని మహ్మదాపురం జీపీ పరిధి మాదిరిపురం వద్ద ఉంటూ కూలీ పనులు చేసే బిహార్‌ కార్మికుడు సంతూ ఠాకూర్‌(30) కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సంతూ ఠాకూర్‌కు సోమవారం ఉదయం కడుపు నొప్పి రావడంతో సహచర కార్మికులు మహబూబాబాద్‌ తీసుకెళ్లి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

ఖమ్మం అర్బన్‌: లారీ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రోహుల్‌ అమీన్‌(45) ఖమ్మంలో ఉంటూ సిమెంట్‌ పనులు చేస్తున్నాడు. ఈనెల 11న మధిరలో పని ముగించుకుని మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వస్తుండగా గోపాలపురం బొడ్రాయి సెంటర్‌ వద్ద యూ టర్న్‌ తీసుకుంటున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమీన్‌కు చికిత్స చేయిస్తుండగానే, పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. ఘటనపై ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్‌ సీఐ నాగరాజు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఖమ్మంక్రైం: ఖమ్మం కొత్త బస్టాండ్‌ ఎదురుగా బాజీ హోటల్‌ పక్కన గుర్తుతెలి యని ఓ వ్యక్తి(45) మృతదేహాన్ని టూటౌన్‌ పోలీసులు మంగళవారం గుర్తించారు. బట్టతల కలిగిన సదరు వ్యక్తి మృతదేహాన్ని రెడ్‌క్రాస్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌, అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59112, 87126 59110 నంబర్లను సంప్రదించాలని సీఐ రామకృష్ణ సూచించారు.

యువకుడిపై అట్రాసిటీ కేసు

తిరుమలాయపాలెం: మండలంలోని ఎదుళ్లచెరువుకు చెందిన వివాహితను వేధించిన యువకుడిపై మంగళవారం కేసు నమోదైంది. గిరిజన వివాహితను అదే గ్రామానికి చెందిన సాయికుమార్‌ ఈనెల 7న వేధించాడు. ఆమె ఫిర్యాదుతో యువకుడిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement