వసతుల కల్పన, కట్టడాల పరిరక్షణకు రూ.4.26 కోట్లు
దేశ, విదేశాల బౌద్ధ భిక్షువులతో
భేటీ అయిన కలెక్టర్ దివాకర
నేలకొండపల్లి: నేలకొండపల్లిలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాచీన బౌద్ధక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి వారసత్వ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. బౌద్ధక్షేత్రం వద్ద మంగళవారం నిర్వహించిన ఉత్సవంలో కంబోడియా, థాయ్‌లాండ్‌తో పాటు దేశానికి చెందిన వివిధ ప్రాంతాల బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర హాజరై క్షేత్రంలో పర్యాటక, మౌలిక సదుపాయాల అభివృద్ధి పురావస్తు కట్టడాల పరిరక్షణ పునరుద్ధరణపై సలహాలు స్వీకరించారు.
కోర్ కమిటీ ఏర్పాటు
కలెక్టర్ దివాకర మాట్లాడుతూ గతంలో చేపట్టిన తవ్వకాల ద్వారా మహాస్తూపం, బౌద్ధ విహారాలు సమావేశ మందిరాలు, ఇతర నిర్మాణాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈమేరకు చారిత్రక సంపదను పరిరక్షిస్తూ భావితరాలకు అందించడంతో పాటు దేశ, విదేశాల యాత్రికులను ఆకర్షించేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం పురావస్తు శాఖ సంచాలకులతో పాటు బౌద్ధ ధర్మ నిపుణులు శివనాగిరెడ్డి, రిటైడ్ ఐపీఎస్ ఉపేంద్రరెడ్డి, బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మయ్య తదితరులతో కూడిన ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. బౌద్ధభిక్షువులు, నిపుణుల సలహాలు స్వీకరించి ఏడాదిన్నరలోగానే నేలకొండపల్లిని అత్యుత్తమ క్షేత్రంగా మారుస్తామని వెల్లడించారు. అనంతరం హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్ ఫ్రోఫెసర్ కుతాడి అర్జున్‌రావు మాట్లాడుతూ అభివృద్ధికి అవసరమైన నిధులను వైటీపీఎస్, జెన్‌కో ద్వారా సమకూర్చుకున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, హెరిటేజ్ డీడీలు నాగరాజు, నర్సింగ్, బుద్ధవనం ఎస్టేట్ ఆఫీసర్ డాక్టర్ రవిచంద్రారెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, డీఐఈఓ కె.రవిబాబు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ ఎం.శ్రీనివాసరావు, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, ధమ్మపద బుద్ధవిహార్ చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన సద్దా రఖిత తదితరులు పాల్గొన్నారు.
బుద్ధం శరణం గచ్ఛామి!
దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం వద్ద విదేశీయుల రాకతో సందడి నెలకొంది. ధమ్మ పద విహార చారిటబుల్ ట్రస్టు ప్రతినిధి బన్తే సద్ధా రఖిత ఆధ్వర్యాన నిర్వహించిన ఉత్సవాలకు థాయ్‌లాండ్, కాంబోడియాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల బౌద్ధ భిక్షువులు వచ్చారు. థాయ్‌లాండ్‌కు చెందిన అజాన్ కోవిద్, అజాన్ సరితో, అజాన్ ధమ్మ ధరో, అజాన్ తిరయూత్, కాంబోడియాకు చెందిన ఇంద్రియ, సంవరో, మహారాష్ట్రకు చెందిన అభివన్నో క్షేత్రం చుట్టూ తిరిగి పరిశీలించారు. వీరికి కలెక్టర్‌తో చర్చల అనంతరం సిద్ధార్ధ యోగా విద్యాలయంలో భోజనాలు ఏర్పాటుచేశారు.


