ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈమేరకు మూడో రోజైన మంగళవారం శ్రీవారికి పంచామృతంతో అభిషేకం చేయడమే కాక యాగశాలలోని శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత అలివేలుమంగ అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరించగా, పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతో పాటు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మతో పాటు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
రీసర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్
తల్లాడ/పెనుబల్లి/కల్లూరు రూరల్: తల్లాడ మండలం లక్ష్మీపురం, పెనుబల్లి మండలం తుమ్మలపల్లి, కల్లూరు మండలం రఘునాథగూడెంలో భూముల రీసర్వేను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. సర్వే తీరుపై తహసీల్దార్లు, సర్వేయర్లతో సమీక్షించారు. రైతులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి పారదర్శకంగా సర్వే చేయాలని, రైతుల వద్ద ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తల్లాడ తహసీల్దార్, ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా
కూసుమంచి: పంటలు చేతికొచ్చే వరకు రైతులు ఇబ్బంది పడకుండా విద్యుత్ సరఫరా చేస్తామని ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మండలంలోని చేగొమ్మ, పోచారం, నర్సింహులగూడెం, కూసుమంచిలోని సబ్‌స్టేషన్లను మంగళవా రం పరిశీలించిన ఆయన డీఈ నాగేశ్వరరావు, ఏడీఈ వెంకట్, వ్యవసాయశాఖ ఏడీఏ సతీష్ తో కలిసి విద్యుత్ సరఫరాపై సమీక్షించారు. పలువురు రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, విద్యుత్ కోతల సమస్యను ఎస్‌ఈ దృష్టికి తీసుకురాగా సమస్య లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు 54.4 లక్షల యూనిట్ల కోటాకు గానూ 77.32 లక్షల యూని ట్ల వినియోగం జరుగుతోందని తెలిపారు. అయినా వ్యవసాయానికి రోజుకు 11గంటల సరఫరా చేస్తుండగా, మరో రెండు గంటలైనా పెంచుతామని చెప్పారు. లోఓల్టేజీ సమస్యతో రోజుకు సగటున 12 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండడంతో 305 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రత్యామ్నాయంగా సిద్ధం చేశామని తెలిపారు. కూసుమంచి సబ్‌స్టేషన్‌లో ఎనిమిది మెగావాట్ల పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌ఈ వెల్లడించారు.


