నకిరేకల్ : దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసేందుకు ఆటోడ్రైవర్ యత్నించిన వ్యవహారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో కలకలం రేపింది. జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. వీరి తండ్రి కూడా అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దసరా సెలవులకు శాలిగౌరారం మండలం ఊట్కూరులోని అమ్మమ్మ వద్దకు వెళ్లేందుకు వారిద్దరు హైదరాబాద్ నుంచి బస్సులో నకిరేకల్ చేరుకుని, సూర్యాపేట వైపు వెళ్తున్న ఆటో ఎక్కి సెంటర్‌లో దించాలని చెప్పారు. అయితే, ఆటోడ్రైవర్ అటుకాకుండా సూర్యాపేట వైపు వేగంగా వెళ్తూ ఇనుపాముల జంక్షన్ సమీపాన హైవే ఎక్కుతుండగా.. బాలికలు ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు. దీంతో కిడ్నాప్ చేస్తున్నాడనే భయంతో వారిద్దరు దూకగా గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వారి తండ్రి నకిరేకల్ చేరుకుని ఆస్పత్రిలో చికిత్స చేయించి, తన కుమార్తెలను డ్రైవర్ కిడ్నాప్‌కు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఆటో డ్రైవర్ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు చెందిన వీరన్నగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


