ఇదే అదునుగా జిమ్మిక్కులు..
సగానికి పడిపోయిన దిగుబడి
డిమాండ్ ఉన్నా దక్కని
కనీస మద్దతు ధర
సీసీఐ కొనుగోళ్లు మొదలైతేనే
పరిస్థితిలో మార్పు
పత్తి సాగుతో నష్టం
ప్రభుత్వం కొనుగోలు చేయాలి
ఖమ్మంవ్యవసాయం: పత్తి రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు వాతావరణం అనుకూలంగా లేక దిగుబడి సగానికి పడిపోయింది. మరోవైపు మార్కెట్లో డిమాండ్ ఉన్నా కనీస మద్దతు ధర దక్కక పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. సీసీఐ కొనుగోళ్లు మొదలుకాకపోవడంతో వ్యాపారులు చెప్పిందే వేదంలా సాగుతుండడంతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు.
దెబ్బతీసిన వర్షాభావ పరిస్థితులు
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో వర్షాలు సంతృప్తికరంగా ఉండడంతో జిల్లా రైతులు 2,35,637 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ ఆతర్వాత జూలై, ఆగస్టుల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, సెప్టెంబర్‌లో తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షం పూత, కాత దశలో ఉన్న పత్తిని దెబ్బతీసింది. పైరు పండు బారి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా ఎకరాకు 10–12 క్వింటాళ్లు వచ్చే దిగుబడి ఈ ఏడాది 4–5 క్వింటాళ్లకు మించే పరిస్థితి లేదు. ఇక ఈ ఏడాది పత్తి క్వింటాకు కేంద్రప్రభుత్వం రూ.8,667గా నిర్ణయించింది. ఇది గతేడాది కంటే రూ.557 ఎక్కువ కావడం విశేషం. అంతేకాక జాతీయ, అంతర్జాతీయంగా పత్తి, బేళ్లు, సీడ్ ఆయిల్‌కు మంచి డిమాండ్ ఉంది. దీంతో మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలకాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సీజన్ మొదలవగానే వ్యాపారులు తేమ శాతం పేరిట క్వింటాకు రూ.7 వేల నుంచి రూ.8 వేలకు మించి ధర పెట్టడం లేదు. నాణ్యమైన పత్తికి కూడా ధర పెంచకపోవడంతో రైతులు దగాపడుతున్నారు.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. పత్తితీత మొదలై మార్కెట్‌కు పంట వస్తున్నా సీసీఐ కేంద్రాల జాడ లేక వ్యాపారులు మాయాజాలం చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది జిన్నింగ్ మిల్లులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసినా కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాలేదు. సీసీఐ కేంద్రాలు మొదలైతే తప్ప పోటీ ఏర్పడి వ్యాపారులు ధర పెంచే అవకాశం లేదు. కాగా, పత్తి సాగు ఎకరాకు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు పెట్టుబడి అవుతుంది. కౌలు రైతులపై అదనంగా మరో రూ.10వేల నుంచి రూ.15 వేల భారం పడుతుంది. ప్రస్తుతం వస్తున్న 4–5 క్వింటాళ్ల దిగుబడి, దీనికి తక్కువ ధర దక్కుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
పత్తి రైతుకు కన్నీరు
పత్తికి డిమాండ్ ఉందంటున్నా వ్యాపారులు ధర పెట్టడం లేదు. ఎనిమిది క్వింటాళ్ల పత్తి అమ్మకానికి తీసుకొచ్చా. నాణ్య తగా ఉన్నప్పటికీ క్వింటాకు రూ.8 వేలు దాటలేదు. దీంతో పత్తి సాగు చేసిన వారికి ఈ ఏడాది నష్టమే.
– అంగిరేకుల వెంకన్న, రెడ్డిగూడెం
సీసీఐ కొనుగోళ్లు ప్రారంభిస్తే వ్యాపారులు ధర పెంచే అవకాశముంది. ఇప్పుడు తేమ పేరిట ధరలో కోత విధిస్తున్నారు. సీసీఐ కేంద్రాలు లేక వ్యాపారులకు విక్రయించక తప్పడం లేదు. ఫలితంగా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.
– గూదె మల్లయ్య, ముత్తగూడెం


