ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీవారికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి నుంచి తీర్థపు బిందెను తోడ్కోని ఈఓ జగన్మోహన్‌రావు, ఆలయ చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, అర్చకులు, సిబ్బంది మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లు కొలువైన యాగశాలలోకి ప్రవేశించారు. అక్కడ ఈఓతో పాటు దాతలు తుళ్లూరు కోటేశ్వరరావు – నిర్మలకుమారి దంపతులు పట్టువస్త్రాలు బహుకరించారు. అనంతరం ఉత్సవాలను ప్రారంభించగా స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు యాగశాలలోని అలివేలు మంగ అమ్మవారిని బాలాత్రిపుర సుందరి దేవీగా అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


