వైరా: సీనియర్స్ విభాగంలో 12వ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా(లెగ్ వాలీబాల్) పోటీలు ఆదివా రం వైరాలో ప్రారంభమయ్యాయి. వైరా న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను సెపక్ తప్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాపా మురళీకృష్ణ, ఎన్‌ఎల్‌ఎఫ్ కరస్పాండెంట్ డాక్టర్ పి.భూమేష్‌రావు ప్రారంభించారు. సెపక్ తక్రా అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పెరిక సురేష్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ, ఏసీపీ సాధుల సారంగపాణి తదితరులు పోటీలను వీక్షించా రు. కాగా, ఇక్కడే ప్రతిభ కనబరిచే క్రీడాకారులతో రాష్ట్ర జట్టును ఎంపిక చేయనుండగా, ఈ నెల 29 నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగే జాతీయ స్థాయి పొటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. వైరా ఎస్‌ఐ పి. రామారావుతో పాటు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాయల నాగేశ్వరరావు, డాక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఖో–ఖో
పోటీలకు జట్ల ఎంపిక
కల్లూరు రూరల్: హైదరాబాద్‌లో ఈనెల 15వ తేదీనుంచి జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ ఖో–ఖో పోటీలకు ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. కల్లూరులోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఆదివారం ఎంపిక పోటీలు నిర్వహించగా, 70 మంది బాలికలు, 150 మంది బాలురలో ప్రతిభ కనబరిచిన వారితో జట్లు ఎంపిక చేసినట్లు ఖో–ఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరరాఘవయ్య తెలిపారు. క్రీడాకారుల భోజన, వసతి, ప్రయాణ ఖర్చులతో పాటు కిట్లను అసోసియేషన్ అధ్యక్షుడు మువ్వా విజయబాబు సమకూర్చనున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు కాటేపల్లి కిరణ్‌కుమార్, ఎస్.రామారావు, రమాదేవి, తులసి, త్రివేణి,ఎన్.ప్రసాద్, సమ్మయ్య, సురేష్, భద్రం, సైదులు, రవి, వసంతరావు పాల్గొన్నారు.
ఆప్టోమెట్రీలో
బంగారు పతకం
కష్టాలను అధిగమించి
ప్రతిభ చాటిన కారేపల్లి వాసి
కారేపల్లి: కారేపల్లికి చెందిన విద్యార్ధి అఖిల్ ఉల్లాఖాన్ బీఎస్సీ ఆప్టోమెట్రీలో బంగారు పతకం సాధించాడు. ఏపీలోని రాజమహేంద్రవరం జీఎస్ ఎల్ మెడికల్ కళాశాలలో శనివా రం జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో ఆయన ఆప్టోమెట్రిస్ట్(కంటి విద్యానిపుణుడు)గా చాటిన ప్రతిభకు పతకం మెడల్ అందుకున్నాడు. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే అఖిల్ ఉల్లాఖాన్ మెడికల్ కళాశాలలో ఉచిత సీటు సాధించడం విశేషం.
కుటుంబ ఇబ్బందులు..
కారేపల్లి మాజీ వార్డు సభ్యుడైన మహమ్మద్ ఖలీలుల్లాఖాన్ ఆటో నడుపుతూ జీవనం సాగించగా, ఆయన కుమారుడు అఖిల్ ఉల్లాఖాన్‌కు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని విస్మరించలేదు. తండ్రి రోడ్డు ప్రమాదంతో ఆస్పత్రి పాలైనా, తల్లి రషీదా కిడ్నీ వ్యాధి బారిన పడినా వారిని కాపాడుకుంటూ, చెల్లెలు రీషా బాధ్యతలు చూస్తూనే చదువు కొనసాగించాడు. ఈక్రమాన బంగారు పతకం సాధించడంపై పలువురు అభినందించారు.


