ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, ఖమ్మంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత అశ్వారావుపేటలోని మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అండర్–20 బాలికల కబడ్డీ టోర్నీని మంత్రి ప్రారంభిస్తారని క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి తెలిపారు.
అపరాలు, నూనెగింజల పంటలే శ్రేయస్కరం
ఖమ్మంవ్యవసాయం: వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున రైతులు రానున్న యాసంగి సీజన్‌లో అపరాలు, నూనెగింజల పంటలు సాగు చేయడం శ్రేయస్కరమని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సరిత తెలి పారు. అంతేకాక సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఖమ్మం రామన్నపేట రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వాతా వరణం, నీటి లభ్యత ఆధారంగా పంటలు ఎంచుకోవాలని తెలిపారు. రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ బి.వాణి, ఏఓలు ఎస్‌వీకే.నారాయణ, టి.అరుణజ్యోతి, బి.కిషోర్‌బాబు పెసర, మినుము, జొన్న, పొద్దుతిరుగుడు, శనగ, కూరగాయల పంటల సాగుతో లాభాలు, ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను వివరించారు. బీటీఎం ఆనందరావు, ఏఈఓ ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
యాసంగిలో
ఆరుతడి పంటలే మేలు
ఖమ్మంరూరల్: ఎన్‌నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్నందున, యాసంగిలో తక్కువ నీటితో పండే పెసర, కందులు తదితర పప్పుధాన్యాలే సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు, గుదిమళ్ల, ముత్తగూడెంలో పర్యటించిన ఆయన వెంకటగిరి రైతు వేదికలో రైతులకు పెసర విత్తనాలు పంపిణీ చేశారు. వర్షభావ పరిస్థితులతో యాసంగిలో వరి సాగుకు నీటి లభ్యత ఉండదని తెలిపారు. ఈమేరకు ప్రత్యామ్నాయ పంటల సాగులో రైతులను ప్రోత్సహించేందుకు ఎంజీజీ 385 రకం పెసర విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. కూసుమంచి ఏడీఏ ఈ.రాజేష్, ఏఓ జె.ఉమానాగేష్, ఏఈఓలు ఆదర్శ్, వంశీ పాల్గొన్నారు.
పాడి రైతులకు
‘విజయ’ ప్రోత్సాహకాలు
నేలకొండపల్లి: విజయ డెయిరీ ద్వారా పాడి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు డిప్యూ టీ డైరెక్టర్ కొడిరెక్క రవికుమార్ తెలిపారు. రెండేసి గేదెల కొనుగోలుకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందించనున్నట్లు వెల్ల డించారు. నేలకొండపల్లి మండలం తిరుమలా పురంలో శుక్రవారం నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. విజయ డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.92 చెల్లిస్తుండగా, ఉమ్మడి జిల్లాలోని 150 కేంద్రాల నుంచి 2వేల మంది రైతులు 5,500 లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారని తెలిపారు. పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఆర్.శ్రీనివాసరావు, పశు వైద్యాధికారి భువనేష్‌కుమార్, సర్పంచ్ కమదన ప్రవీణ్ పాల్గొన్నారు.
22వరకు సెలవులు
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. ఈ సమయాన ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పెసల విక్రయాల్లో
మరో ప్రయత్నం
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ కేంద్రాల్లో పెసల కొనుగోళ్లకు శక్రవారం అధికారులు చివరి ప్రయత్నం చేశారు. ఖమ్మం, వైరా మార్కెట్లలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు తీసుకువచ్చిన పెసలు నాణ్యతగా లేవని గురువారం నాఫెడ్ అధికారులు తిరస్కరించారు. ఈమేరకు డీసీఎంఎస్ అధికారులు శుక్రవారం ఖమ్మం, వైరా నుంచి 20 టన్నుల చొప్పున 40 టన్నుల పెసలను లారీల్లో సూర్యాపేట నాఫెడ్ గోదాములకు పంపించారు. అక్కడ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, తిరస్కరిస్తే తిరిగి రైతులకు అప్పగించే ఒప్పందంతో పంపించామని డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ సందీప్ తెలిపారు.


