● 12న టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ ● రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం అర్బన్: ఖమ్మంలో టీటీడీ ఆధ్వర్యాన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనుండడం అదృష్టమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 12న ఆలయ భూమిపూజ జరగనుండగా, భక్తులకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భూమి ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ ఆభిషేక్ అగస్త్య, టీటీడీ ఈఈ సుధాకర్‌రెడ్డితో కలిసి శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లలో లోపాలకు తావివ్వొద్దని తెలిపారు. భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ సౌకర్యాలతో పాటు లడ్డూ పంపిణీ కౌంటర్లు, తాగునీరు, భోజన వసతిపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేసిన అగ్నిమాపక శాఖ ఉద్యోగులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ద్వారా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సీపీ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పోలీసు బందోబస్తు, ఇతర ఏర్పాట్లను వివరించారు. సుడా, మార్కెట్, పీఏసీఎస్ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, యరగర్ల హన్మంతరావు, రావూరి సైదబాబు, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాసాచార్యులు, డీఎంహెచ్‌ఓ రామారావు, ఆర్‌అండ్‌బీ ఈఈ యుగంధర్‌తో పాటు పునుకొల్లు నీరజ, రావూరి కరుణ, కమర్తపు మురళి, సంక్రాంతి నాగేశ్వరరావు, ఏర్నేని రామారావు, నాగండ్ల దీపక్‌చౌదరి, చండ్రా రాంబాబు, నల్లమల ఆనంద్, పగడాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


