● సత్తుపల్లి, వేంసూరులో ‘సిట్’ సోదాలు ● బెంజ్ కారు సహా 17 వస్తువులు స్వాధీనం
సత్తుపల్లి: కొద్దినెలల క్రితం ఖమ్మం జిల్లా కేంద్రంగా జరిగిన సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన సైబర్ ఆర్థిక నేరాల కేసుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సత్తుపల్లి, వీఎం బంజర పోలీసుస్టేషన్లలో నమోదైన సైబర్ కేసులను సైబర్ సెక్యూరిటీ సిట్‌కు బదలాయించారు. ఈమేరకు విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరైన సత్తుపల్లి పోస్టాఫీస్ రోడ్డుకు చెందని బొప్పన నాగ ప్రసాద్, వేంసూరు మండలం రాజుగూడెంకు చెందిన మేడా సతీష్ నివాసాల్లో శుక్రవారం ఏకకాలంలో సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ కేవీఎం.ప్రసాద్, సిబ్బందితో సుమారు గంటపాటు సోదాలు చేపట్టారు. ఈక్రమాన రెండు ల్యాప్ టాప్‌లు, ఆరు సెల్ ఫోన్లు, డాక్యుమెంట్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, గోల్డ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బెంజ్ కారును సైతం హైదరాబాద్ తీసుకెళ్లారు. తనిఖీల్లో సత్తుపల్లి, వేంసూరు ఎస్‌ఐలు వీరప్రసాద్, ప్రదీప్ పాల్గొనగా వివరాల వెల్లడికి నిరాకరించారు.
తీగ లాగితే కదిలిన దొంక
సైబర్ నేరాల్లో ప్రధాన నిందితుల్లో ఒకరైన సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్‌కళ్యాణ్‌ను వీఎం బంజర పోలీసులు అరెస్టు చేయగా, విచారణ సమయంలో బొప్పన నాగప్రసాద్ కీలక సూత్రధారిగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఆయనను సైతం ఫిబ్రవరిలో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొంతకాలానికి ఇద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక పోట్రు మనోజ్ కళ్యాణ్ బావమరిది మేడా సతీష్ ఇంట్లోనూ తనిఖీ చేసినా వివరాలు వెల్లడించలేదు. గత ఏడాది డిసెంబర్ 24న సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో మోసాల డొంక కదిలింది. రూ.547 కోట్ల భారీ సైబర్ క్రైమ్ జరిగిందని జనవరి 11న ఖమ్మం సీపీ సునీల్‌దత్ వెల్లడించారు. అయితే, మోసాలు రూ.వెయ్యి కోట్లు దాటాయనే అంచనాతో కేసును సైబర్ సెక్యూరిటీ సిట్‌కు అప్పగించారు. ఇప్పటివరకు 52 మంది ఈ కేసులో అరెస్టయ్యారు. కాగా, కల్లూరు మండలం లింగాలకు చెందిన దేవరపల్లి పట్టాభి పాత్ర సైతం ఉందనే ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు గత ఆగస్టులో అరెస్టు చేశారు. ఐదు నెలల పాటు విదేశాల్లో తలదాచుకుని హైదరాబాద్ వచ్చాక అరెస్ట్ చేయగా ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈనేపథ్యాన సైబర్ సెక్యూరిటీ సిట్, మరోవైపు ఈడీ విచారణ చేస్తున్నట్లు తెలిసింది.


