సాగు.. బాగయ్యేలా ! | - | Sakshi
Sakshi News home page

సాగు.. బాగయ్యేలా !

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

● కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి ● రైతులకు విత్తనాల కిట్ల పంపిణీ ● ఐదేసి రకాలతో జిల్లాకు 1,250 చొప్పున కిట్లు రూ.500 విలువ ఆసక్తి, అర్హత ఉన్న రైతులకు..

వేసవిలో సాగు..

రైతులకు ప్రోత్సాహం

● కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి ● రైతులకు విత్తనాల కిట్ల పంపిణీ ● ఐదేసి రకాలతో జిల్లాకు 1,250 చొప్పున కిట్లు

ఖమ్మంవ్యవసాయం: కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచేలా ఉద్యాన శాఖ ఉచితంగా రైతులకు విత్తనాల కిట్లు పంపిణీ చేస్తోంది. రైతులు కొంత కాలంగా వరి, ఇతర వాణిజ్య పంటల సాగుపైనే దృష్టి సారిస్తుండడంతో జనాభాకు అనుగుణంగా కూరగాయలు, ఆకుకూరల సాగు కావడం లేదు. ఫలితంగా కూరగాయలను సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండగా, ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేలా ప్రభుత్వం కూరగాయలు, ఆకుకూరల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ నుంచి దిగుమతి చేసుకున్న కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను కిట్లుగా రూపొందించారు. ఒక్కో కిట్‌లోరూ.500 విలువైన ఐదు రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు ఉంటాయి. టమాట, పచ్చిమిర్చి, బెండ, తోటకూర, పాలకూర విత్తనాలు ఉండగా, వీటిని బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి చేస్తోంది. అక్కడి నుంచి నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ దిగుమతి చేసుకోగా, ప్రతీ జిల్లాలో 1,250 కిట్ల పంపిణీకి ఉద్యాన శాఖ శ్రీకారం చుట్టింది.

కిట్లను ఖమ్మం, కూసుమంచి, మధిర, వైరా, సత్తుపల్లి ఉద్యాన డివిజన్ల వారీగా రైతులకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. అర ఎకరం నుంచి ఐదెకరాల వరకు భూమి ఉన్న ఆసక్తి, అర్హత ఉన్న రైతులకు ఈ మినీ కిట్లు అందిస్తారు. ఆసక్తి కలిగిన రైతులు పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు ఫొటోతో ఉద్యాన అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

ఉద్యాన శాఖ సరఫరా చేస్తున్న కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను వేసవిలో సాగు చేసుకోవచ్చు. నీటి వనరులు ఉన్న రైతులు తమ క్షేత్రాల్లో సాగు చేస్తే తక్కువ కాలపరిమితిలోనే పంటలు చేతికి వస్తాయి. పాలకూర, తోటకూర వంటివి 25 రోజుల్లో, టమాట 50 రోజుల్లో, పచ్చిమిర్చి, బెండ 40 రోజుల్లో దిగుబడి మొదలవుతుంది. వేసవిలో కూరగాయలకు డిమాండ్‌ ఉన్నందున రైతులు మంచి ఆదాయం సమకూరడమే కాక ప్రజలకు తాజా కూరగాయలు, ఆకుకూరలు తక్కువ ధరలో లభిస్తాయని

చెబుతున్నారు.

జిల్లాలో కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా సరఫరా చేసిన విత్తనాల కిట్లను ఆసక్తి ఉన్న రైతులకు పంపిణీ చేస్తున్నాం. మా శాఖ అధికారులు వేసవిలో కూరగాయల, ఆకుకూరల సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు.

– ఎంవీ.మధుసూదన్‌,

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement