హనుమాన్‌ జయంతికి ఏర్పాట్లేవి? | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ జయంతికి ఏర్పాట్లేవి?

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

శ్రీరామనవమి తరహాలో

వసతుల కల్పనకు వేడుకోలు

ఏటా అరకొర సౌకర్యాలతో ఇబ్బందిపడుతున్న దీక్షాపరులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జై శ్రీరామ్‌ నినాదం వినిపించడంలో అగ్రస్థానం ఎప్పుడూ హనుమంతుడిదే. సిరియ తంబిగా రాముడి చేత ప్రశంసలు హనుమంతుడికి దక్కాయి. అందుకే ఆంజనేయుడి భక్తులు శ్రీరాముడి చెంతన హనుమాన్‌ దీక్షా విమరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఎంతో భక్తితో వచ్చే దీక్షాపరులకు ఇక్కడ కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయి.

రెండుసార్లు జయంతి ఉత్సవాలు

హనుమంతుడి భక్తుల్లో వేర్వేరు సంప్రదాయాలను, క్యాలెండర్లను పాటించేవారు ఉన్నారు. దీని ప్రకారం హనుమాన్‌ జయంతిని ఏటా రెండు వేర్వేరు తేదీల్లో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2, మే 12వ తేదీల్లో హనుమాన్‌ జయంతిని జరుపుకోనున్నారు. ఏప్రిల్‌ 2న జరిగే వేడుకలను చిన్న జయంతిగా, మే 12న జరిగే వేడుకలను పెద్ద జయంతిగా గుర్తిస్తున్నారు. చిన్న జయంతి సందర్భంగా ప్రసిద్ధి చెందిన హనుమాన్‌ ఆలయం ఉన్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకి వెళితే, పెద్ద జయంతి సందర్భంగా సీతారాములు కొలుదీరిన భద్రాచల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు.

శబరిమల తరహాలో..

ఏటా లక్షలాది మంది భక్తులు హనుమాన్‌ మాల ధరిస్తున్నారు. వీరిలో కొందరు చిన్న జయంతి రోజున మాల విరమణ చేస్తే, మరికొందరు అదే రోజున మాల ధరించి పెద్ద జయంతి రోజున విరమిస్తున్నారు. చిన్న జయంతికి కొండగట్టు క్షేత్రంలో దీక్ష తీసుకునే భక్తులు పెద్ద జయంతికి భద్రాచలంలో మాల విరమణ చేస్తున్నారు. ఫలితంగా గడిచిన దశాబ్దకాలంగా పెద్ద జయంతి రోజున వేలాదిగా హనుమాన్‌ మాలధారులు భద్రాచలం చేరుకుంటున్నారు. క్రమేణా అయ్యప్ప మాల ధరించిన వారికి శబరిమల ఎలాగో హనుమాన్‌ మాలధారులకు భద్రాచలం క్షేత్రం అలాగే అన్నట్టుగా భక్తుల్లో నమ్మకం, విశ్వాసం పెరుగుతోంది.

మూడో వేడుకగా..

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వందల ఏళ్లుగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, ఆ ముందు రోజు తెప్పోత్సవం సైతం కనుల పండువగా జరుపుతున్నారు. ఈ రెండు వేడుకలు కనులారా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఇప్పుడు అదే స్థాయిలో హనుమాన్‌ జయంతి సందర్భంగా కూడా భద్రగిరికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్‌ జయంతిని భద్రాచలంలో జరిగే మూడో అతిపెద్ద వేడుకగా గుర్తించాల్సిన అవసరం ఉంది.

కావాలి కార్యాచరణ

శ్రీరామనవమి, ముక్కోటి పండుగల తరహాలో హనుమాన్‌ జయంతి సందర్భంగా దేవస్థానం, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం లేదు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హనుమాన్‌ మాలధారులకు ఇబ్బంది రాకుండా డార్మిటరీలు, తాగునీరు వంటి అదనపు సౌకర్యాలు, మాల విరమణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, భజన మందిరం వంటివి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. పెద్ద జయంతికి ఇంకా నలభై రోజుల సమయం అందుబాటులో ఉన్నందున కార్యాచరణ మొదలు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాళ్లకు బొబ్బలు వస్తున్నా..

నడి వేసవిలో రామభక్తితో భద్రాచలం వచ్చే దాసాంజనేయ మాలధారులకు కనీసం నీడ కరువైపోతోంది. గొంతెండితే గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చే దీక్షాపరులకు మండే ఎండల ధాటికి ఆలయం నుంచి గోదావరినదీ తీరానికి వెళ్లి వచ్చే సరికి కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. చలు వ పందిళ్లు, షామియానాలు, తాగునీటి సౌకర్యం, ప్రత్యేక క్యూలైన్లు వంటి ఏర్పాటు చేస్తే దీక్షా పరులకు ఇబ్బందులు తొలగిపోతాయి.

భద్రగిరికి పోటెత్తుతున్న హనుమాన్‌ మాలధారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement