ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ చీరల పంపిణీ బుధవారం ప్రారంభమైంది. గతంలోనే చీరలు జిల్లాకు చేరగా, కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేశాక నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈమేరకు ఖమ్మం 26వ డివిజన్ సుగ్గుల వారి తోటలో కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య చీరలు అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులే కాక అర్హత కలిగిన ప్రతీ మహిళకు చీరలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు శ్రీనివాస్, అనిల్‌కుమార్, మెప్మా టీఎంసీ సుజాత, నాయకులు బొడ్డుబోయిన శ్రీను, కనకరాజు, ప్రసాద్, యాకూబ్, బుజ్జి, మాధవి, సైదా, సలీం, మదార్ పాల్గొన్నారు.


