సుజాతనగర్: మీ సేవ కేంద్రాల్లో యూజర్ చార్జీలు పెరిగాయి. ఈనెల 1వ తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతోంది. మీ సేవ దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరీలు ఉండగా, రెండింటిలోనూ చార్జీలు పెంచారు. కేటగిరీ–ఏ దరఖాస్తులకు గతంలో యూజర్ చార్జీ రూ.35 ఉంటే రూ.62కు పెంచారు. కేటగిరీ–బీ దరఖాస్తుల చార్జీని రూ.45 నుంచి రూ.80 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం కూడా మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.53గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ.4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18, రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు.
యూజర్ చార్జీలు రెట్టింపు చేసిన ప్రభుత్వం


