కొత్త మిర్చి వస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

కొత్త మిర్చి వస్తోంది..

Jan 7 2026 7:29 AM | Updated on Jan 7 2026 7:29 AM

కొత్త మిర్చి వస్తోంది..

కొత్త మిర్చి వస్తోంది..

● ఖమ్మం మార్కెట్‌కు నానాటికీ పెరుగుతున్న సరుకు ● తొలి కోత మైలకాయ విక్రయానికే మొగ్గు ● దేశీయ డిమాండ్‌ మేరకే ధరలు

విదేశాల్లో డిమాండ్‌ అంతంతే..

● ఖమ్మం మార్కెట్‌కు నానాటికీ పెరుగుతున్న సరుకు ● తొలి కోత మైలకాయ విక్రయానికే మొగ్గు ● దేశీయ డిమాండ్‌ మేరకే ధరలు

ఖమ్మంవ్యవసాయం: తెలుగు రాష్ట్రాల్లో ‘తేజా’ మిర్చి కొనుగోళ్లకు పేరున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొద్ది రోజులుగా సరుకు రాక క్రమంగా పెరుగుతోంది. సాధారణంగా సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి కోతలు, విక్రయాలు మొదలవుతాయి. కానీ రెండేళ్లుగా ముందస్తు సాగుతో జనవరి ఆరంభం నాటికే కోతలు ప్రారంభమవుతున్నాయి. ఏటా మిర్చి సాగు సెప్టెంబర్‌లో మొదలుకావాల్సి ఉండగా జూలైలోనే నారు పోసి, ఆగస్టు నుంచి సాగు చేస్తుండడంతో ముందస్తు కోతకు వస్తోంది. డిసెంబర్‌ చివరి వారం నుంచి అరకొరగా అమ్మకాలు మొదలై జనవరి ఆరంభానికి పెరుగుతున్నాయి.

నిత్యం 30వేల బస్తాలు

గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు పలువురు మెరుగైన ధర కోసం కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. జిల్లాలో 48 కోల్డ్‌ స్టోరేజీలే కాక పరిసర జిల్లాల కోల్డ్‌ స్టోరేజీల నుంచి సైతం రైతులు శాంపిళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. నిల్వ మిర్చి నిత్యం 15 వేల బస్తాల వరకు వస్తుండగా, మరోపక్క కొత్త మిర్చి 12వేల నుంచి 15 వేల బస్తాలు వరకు తీసుకొస్తున్నారు.

మైలకాయ కావడంతో..

మిర్చి కోతలు మూడు నుంచి నాలుగు సార్లు సాగుతాయి. మొదట కోసే మిర్చిని మైలకాయ చెబుతూ నిల్వ చేయడానికి వీలులేక విక్రయానికి తీసుకొస్తున్నారు. పూర్వం మైలకాయను చేన్లలోనే వదిలేసినా ఇప్పుడు డిమాండ్‌ ఆధారంగా అమ్ముతున్నారు. ఖమ్మం జిల్లాలో 35 వేల ఎకరాల్లో మిర్చి సాగు కాగా, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, నల్లగొండ, హనుమకొండ జిల్లాల నుంచి సైతం తేజా రకం మిర్చి ఖమ్మం మార్కెట్‌కు వస్తోంది.

గిట్టుబాటు కాని ధర

ప్రస్తుతం పలుకుతున్న ధర మిర్చి రైతులకు గిట్టుబాటయ్యేలా కానరావడం లేదు. ఏటేటా మిర్చి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువులతో పాటు పురుగుల మందు భారం పడుతుండడంతో ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ పెట్టుబడి ఆధారంగా క్వింటాకు రూ.20 వేల ధర ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతుండగా.. ఆ పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్‌పై ఆశలు పెట్టుకుంటున్నారు.

తేజా మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండేది. ప్రధానంగా చైనా దేశానికి ఇక్కడి నుంచి పలువురు వ్యాపారులు ఎగుమతి చేసేవారు. మూడేళ్ల క్రితం ఓ దశలో క్వింటా మిర్చికి రూ.25 వేల వరకు పలికి సగటున రూ.20వేల ధర కొనసాగింది. కానీ ఆతర్వాత ధరలు తగ్గుతూ గత ఏడాది బాగా పడిపోయాయి. నాణ్యత ఆధారంగా రూ.12వేల నుంచి రూ.15,500కు మించి పలకపోవడంతో వ్యాపారులు ఆర్డర్లు ఉంటే కొనుగోలు చేస్తున్నారు. ఇక దేశీయంగా రూ.15వేల నుంచి రూ. 15,500 వరకు ధర పలుకుతుండడంతో నాణ్యత ఆధారంగా ఖమ్మంలో గరిష్టంగా రూ.14,800, మోడల్‌ ధర రూ.14,400, కనిష్టంగా రూ.7వేలుగా నిర్ణయిస్తున్నారు. ఇక్కడి వ్యాపారులు పలువురు మిర్చిని కొనుగోలు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement