బాలికల విభాగంలో చాంపియన్‌గా అశ్వారావుపేట జట్టు
ముగిసిన అగ్రి స్పోర్ట్స్ మీట్
అశ్వారావుపేటరూరల్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల నుంచి 400 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా వాలీబాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్, చెస్, పుట్‌బాల్, ఖోఖో, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం, లాంగ్ జంప్‌తోపాటు మరికొన్ని పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో రాజేంద్రనగర్ జట్టు, బాలికల విభాగంలో అశ్వారావుపేట జట్టు చాంపియన్‌గా నిలిచాయి.
విజేతలు వీరే..
బాలుర విభాగం వాలీబాల్ పోటీల్లో రాజేంద్రనగర్‌పై జగిత్యాల, బాస్కెల్ బాల్‌లో రాజేంద్రనగర్‌పై పాలెం, షటిల్ బ్యాడ్మింటన్‌లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, టేబుల్ టెన్నిస్‌లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, చెస్ పోటీల్లో రాజేంద్రనగర్‌పై వరంగల్, క్యారమ్స్‌లో వరంగల్‌పై రాజేంద్రనగర్, క్రికెట్ పోటీల్లో జగిత్యాలపై రాజేంద్రనగర్, పుట్‌బాల్‌లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, ఖోఖో పోటీల్లో పాలెంపై సిరిసిల్ల, టగ్ ఆఫ్ వార్‌లో సంగారెడ్డిపై సిరిసిల్ల జట్లు గెలుపొందాయి. పరుగు పందెం(100 మీటర్లు)లో అశ్వారావుపేట, సంగారెడ్డి, జగిత్యాల విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
బాలికల విభాగంలో ..
వాలీబాల్‌లో రాజేంద్రనగర్‌పై సంగారెడ్డి, క్యారమ్స్‌లో సైఫాబాద్‌పై అశ్వారావుపేట, టేబుల్ టెన్నిస్‌లో రాజేంద్రనగర్‌పై అశ్వారావుపేట, టెన్నికాయిట్‌లో సైఫాబాద్‌పై అశ్వారావుపేట, షటిల్ బ్యాడ్మింటన్‌లో రాజేంద్రనగర్‌పై సిరిసిల్ల, చెస్‌లో వరంగల్‌పై జగిత్యాల, బాస్కెట్ బాల్‌లో వరంగల్‌పై అశ్వారావుపేట, ఖోఖోలో అశ్వారావుపేట–సిరిసిల్ల సంయుక్తంగా విజయం సాధించాయి. టగ్ ఆఫ్ వార్‌లో ఆదిలాబాద్‌పై వరంగల్, పరుగు పందెం(100 మీటర్లు)లో ప్రథమ స్థానంలో రాజేంద్రనగర్, ద్వితీయ స్థానంలో జగిత్యాల, తృతీయ స్థానంలో అశ్వారావుపేట, అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో ఎం రచన(అశ్వారావుపేట) విజేతగా నిలిచారు. విజేతలకు మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. జయశంకర్ యూనివర్సిటీ డీఎస్‌ఏ చల్లా వేణుగోపాల్ రెడ్డి, అబ్జర్వర్ మధుసూదన్‌రెడ్డి, డీన్ హేమంత్‌కుమార్, ప్రొఫెసర్లు రాంప్రసాద్, శిరీష, నాగాంజలి పాల్గొన్నారు
సాగర్ కాల్వలో దూకి మహిళ ఆత్మహత్య
కొణిజర్ల: ఓ మహిళ సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తనికెళ్లకు చెందిన పొట్లపల్లి పార్వతి(52)కి భర్త మృతి చెందగా, పిల్లలు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతోంది. ఈక్రమాన మంగళవారం బోనకల్ బ్రాంచ్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలిస్తుండగా పెద్దగోపతి లాక్‌ల వద్ద మృతదేహం లభ్యమైంది. మృతురాలి అక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్ తెలిపారు.
లాడ్జిలో వ్యభిచారం
ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ లోని పోస్టాఫీస్ సమీపాన ఓ లాడ్జిలో త్రీటౌన్ పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు విటులు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మోహన్‌బాబు తెలిపారు. హాటల్ మేనేజర్ శ్రీకాంత్‌పై కేసు నమోదు చేయగా, రూ.5,100 స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.


