ఆకాశమే హద్దుగా ఎదగాలి..
అందుకే మహిళలకు నీలం రంగు చీరలు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రఘునాథపాలెం: మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేలా తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద రూ.1.35 కోట్లతో నిర్మించే చిల్డ్రన్ హోమ్ పనులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.54.13కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేయడంతో పాటు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించాక మహిళలకు చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలనే లక్ష్యంతో నీలం రంగు చీరలను అందిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో కులగణన సర్వే ప్రకారం 18ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు చీరలు ఇస్తామని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 1,27,000 మంది విద్యార్థులకు మహిళా సంఘాల ద్వారా ఏకరూప దుస్తులు కుట్టించడంతో రూ.1.27కోట్ల ఆదాయం లభించిందని చెప్పారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీఆర్డీఓ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ రాంగోపాల్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఎస్‌ఈలు యాకూబ్, వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నరసింహారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ పుష్పలత, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఒ ఆశోక్‌కుమార్, సొసైటీ అధ్యక్షుడు తాతా రఘురాం, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వాంకుడోత్ దీపక్, సాదు రమేష్‌రెడ్డి, తుపాకుల యలగొండ స్వామి, మానుకొండ రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్, బీజేపీ
రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వారిని రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్, బీజేపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్లలో కపాస్ కిసాన్ యాప్ పెట్టడంతోనే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తుపాన్ ప్రభావంతో పత్తిలో తేమ శాతం పెరిగినందున 20 శాతం వరకు ఉన్నా కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘రామచంద్రరావు మేధావి కావొచ్చు కానీ రైతుల గురించి అవమానకర వ్యాఖ్యలు చేయొద్దు’ అని సూచించారు. కాగా, ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బీఆర్‌ఎస్ నాయకుల బుద్ధి మారలేదని, వారి ఇంటి ఆడబిడ్డ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాకే రైతుల దగ్గరకు వెళ్లాలని తెలిపారు.
నాణ్యమైన పంట తక్షణమే కొనుగోలు
ఖమ్మం సహకారనగర్: నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం, పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ అనుదీప్‌తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొనుగోళ్లు పూర్తయ్యాక రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోత విధించకుండా ధాన్యం తీసుకునేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, కౌలు రైతు వద్ద నుంచి కూడా పత్తి సేకరించాలని, తేమ శాతం గ్రామాల్లోనే పరిశీలిస్తే ఇబ్బందులు ఉండవని చెప్పారు.
ప్రత్యేక అధికారుల నియామకం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టరేట్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు. చీరల పంపిణీని సాఫీగా జరిగేలా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం సూచించారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, డీఏఓ డి.పుల్లయ్య, డీసీఎస్‌ఓ చందన్‌కుమార్, డీఎం శ్రీలత, డీసీఓ గంగాధర్ పాల్గొన్నారు.


