కాలేజీల్లో తనిఖీలు
● సౌకర్యాలపై ఆరా తీస్తున్న అధికారులు ● ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశీలన
ఖమ్మం సహకారనగర్: విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఎక్కడైనా తప్పులు ఉంటే బాధ్యుల పై చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, బోధనపై అధికార యంత్రాంగం ద్వారా తనిఖీలు చేయిస్తోంది.
132 కాలేజీలు
జిల్లాలోని 21 మండలాల్లో 132 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 35,615మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం 18,193, ద్వితీయ సంవత్సరం 17,422 మంది చదువుతుండగా.. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ల్యాబ్, తరగతి గదులు ఏ స్థాయిలో ఉన్నాయో అధికారులు తనిఖీ చేస్తున్నారు. వారం రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు ఆధ్వర్యాన తనిఖీలు జరుగుతున్నాయి.
తనిఖీల ఉద్దేశం ఇదే..
ప్రభుత్వ కాలేజీల్లో తనిఖీల సందర్భంగా వసతులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు బోధన సక్రమంగా అందుతుందా, లేదా అని పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ విద్యాసంవత్సరం సిలబస్ ఎంత వరకు పూర్తయింది, ప్రాక్టికల్స్ చేయిస్తున్నారా, లేదా అని ఆరా తీయడంతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణపై సూచనలు చేస్తున్నారు. విద్యార్థులు ఎవరైనా ఒత్తిడికి గురవుతుంటే కౌన్సిలర్ల ద్వారా అవగాహన కల్పించాలని చెబుతున్నారు. ఇక ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకులు, సిబ్బంది ఎంత ఎంత మంది ఉన్నారు, సిలబస్ ఎంత వరకు పూర్తయిందో ఆరా తీస్తున్నారు. అలాగే, సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ నిర్వహణ, పరీక్ష ఫీజు వసూళ్లపై వివరాలు సేకరించారు. అంతేకాక అధ్యాపకులు, సిబ్బందికి వేతనాల చెల్లింపు, పీఎఫ్‌పై ఆరా తీయగా.. కొన్ని కళాశాలల్లో లెక్చరర్లకు పీఎఫ్ కట్టడం లేదని గుర్తించారు. అలాగే, ప్రాక్టికల్స్ ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తేల్చారు.
ఉన్నతాధికారులకు నివేదిక
జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో సౌకర్యాలు, అందుతున్న విద్యపై క్షేత్రస్థాయి తనిఖీల్లో తేలిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. ఆపై అందే సూచనల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణఆదిత్య ఆదేశాల మేరకు చేపడుతున్న తనిఖీలు జిల్లాలో చివరి దశకు చేరాయని సమాచారం.


