మధిరకు ఇక ‘వెలుగులు’
నియోజకవర్గంలో గతంలో
ముగ్గురు డీఈలు
కొత్త డివిజన్ ఏర్పాటుతో ఒక డీఈ పరిధిలోనే..
‘సోలార్ విద్యుత్’కు
బోనకల్ మండలం ఎంపిక
యూజీ కేబుల్ ఏర్పాటుకానున్న
తొలి మున్సిపాలిటీగా మధిర
వినియోగదారులకు సౌకర్యం
మండలం గృహ వ్యవసాయ వాణిజ్య పరిశ్రమలు ఇతర డిమాండ్ (బిల్లులు) (రూ.కోట్లలో)
మధిర 25,753 4,237 3,834 200 545 2.00
ఎర్రుపాలెం 15,836 6,580 1,703 133 341 0.87
బోనకల్ 16,275 2,800 1,506 82 272 0.75
చింతకాని 15,669 5,448 1,265 127 364 0.88
ముదిగొండ 15,059 6,814 1,228 149 472 1.36
మధిర: మధిర కేంద్రంగా విద్యుత్ శాఖ నూతన డివిజన్ ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో విద్యుత్ శాఖకు మహర్దశ పట్టినట్టయింది. జిల్లాలో ఇప్పటికే ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, వైరా విద్యుత్ డివిజన్లు ఉండగా కొత్తగా మధిర డివిజన్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుత డివిజన్లు ఇలా..
ఇప్పటివరకు మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాలు వైరా డివిజన్ పరిధిలో ఉండేవి. చింతకాని మండలం ఖమ్మం టౌన్ డివిజన్‌లో, ముదిగొండ మండలం ఖమ్మం రూరల్ డివిజన్‌లో ఉండేవి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడు సబ్ డివిజన్లకు ముగ్గురు ఏడీఈలు, మూడు డివిజన్లకు ముగ్గురు డీఈలు ఉన్నారు. మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల విద్యుత్ రెవెన్యూ కార్యాలయం(ఈఆర్‌ఓ) మధిర కేంద్రంగా ఉంది. చింతకాని, ముదిగొండ మండలాలకు ముదిగొండలో నూతన ఈఆర్‌ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
వేగంగా అభివృద్ధి..
స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. గతంలో లోఓల్టేజీ, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడేవి. రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం నెలల తరబడి ఎదురుచూసేవారు. ఇప్పుడు నూతన డివిజన్ ఏర్పాటుతో ఈ సమస్యలకు చెక్ పెట్టినట్టయింది. ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ముదిగొండ మండలంలో పారిశ్రామిక కనెక్షన్లు అధికంగా ఉన్నాయి. చింతకాని మండలం ఖమ్మం సమీపంలో ఉండడంతో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార కనెక్షన్లు, కొంతమేర వ్యవసాయ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఇక మున్సిపాలిటీల పరిధిలో రాష్ట్రంలోనే మొదటిసారి మధిరలో అండర్ గ్రౌండ్ విద్యుత్(యూజీ కేబుల్) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ.28 కోట్లతో శంకుస్థాపన చేశారు. బోనకల్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఉచిత సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఈ తరుణంలో ఐదు మండలాలను కలుపుతూ నూతన విద్యుత్ డివిజన్ కార్యాలయం ఏర్పాటుతో మరింతగా వెలుగులు నిండుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరంలో సుమారు రూ.40 కోట్లతో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు స్థల సేకరణ చేశారు.
సత్వర సేవలకు అవకాశం..
ఒక శాఖకు సంబంధించిన కార్యాలయాలు ఒకే చోట ఉంటే వినియోగదారులకు సత్వర సేవలు అందే అవకాశం ఉంది. వినియోగదారులు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఏఈ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఏడీఈకి నివేదిక పంపుతారు. అక్కడి నుంచి డివిజన్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటివరకు డివిజన్ కార్యాలయం అంటే వైరా వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మధిరలోనే ఏర్పాటు కావడంతో సేవలు సులభమవుతాయి. అధికారులంతా అందుబాటులో ఉంటే వినియోగదారులకు సైతం ఉపయోగంగా ఉంటుంది.
విద్యుత్ శాఖ నూతన డివిజన్ ఏర్పాటు
మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలను కలుపుతూ విద్యుత్ శాఖలో ఒకే డివిజన్ ఏర్పాటు చేయడంతో వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడంతో ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. బోనకల్ మండలం ఉచిత సోలార్ విద్యుత్‌కు ఎంపిక కావడం, మధిర పట్టణంలో అండర్ గ్రౌండ్ కేబుల్, అనేక విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు త్వరలోనే ఎర్రుపాలెం మండలానికి 132 కేవీ సబ్‌స్టేషన్ కూడా రానుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వేగంగా సాగుతున్నాయి.
– బండి శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ డీఈ, మధిర
మధిరకు ఇక ‘వెలుగులు’
మధిరకు ఇక ‘వెలుగులు’


