పత్తి కొనుగోళ్లకు బ్రేక్
పంట విక్రయించడం ఎలా..
జిల్లాలో సమస్యలు లేవు
సమస్య పరిష్కరించేంత వరకు బందే..
నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్ల నిలిపివేత
● సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ కాటన్ అసోసియేషన్ నిర్ణయం
ఖమ్మంవ్యవసాయం : సీసీఐ విధించిన నిబంధనలను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేయాలని రాష్ట్ర కాటన్ ట్రేడర్స్, మిల్లర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో సీసీఐ గుర్తించిన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు యజమానులు ప్రకటించారు. జిన్నింగ్ మిల్లులను ఎల్–1, ఎల్–2, ఎల్–3 గా విభజిస్తూ సీసీఐ అమలు చేస్తున్న నిబంధనలను అసోసియేషన్ వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించగా.. ఆయన సీసీఐ మేనేజింగ్ డైరెక్టర్‌తో మాట్లాడారు. ఎల్–1, ఎల్–2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరారు. కాగా, ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నిస్తోంది.
జిన్నింగ్ మిల్లుల ముందు బోర్డులు
జిల్లాలో జిన్నింగ్ మిల్లుల ఎదుట సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ఫ్ల్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీసీఐ నిబంధనలు సడలించాలని, ఎల్–1, ఎల్–2, ఎల్–3 విభజనను రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు నిర్వహించబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులు పత్తి కొనుగోళ్లకు సముఖత వ్యక్తం చేయగా, అక్కడ కొనుగోళ్లు యధాతథంగా సాగే అవకాశం ఉంది.
రైతులకు తప్పని నష్టం..
పత్తి కొనుగోళ్లు నిలిచిపోతే రైతులకు నష్టం వాటిల్లనుంది. సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టకుంటే వారికి ప్రభుత్వ మద్దతు ధర దక్కదు. ఇక కొనుగోలు చేయకుంటే తమ పరిస్థితి ఏంటని ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీసీఐ నిబంధనలతో జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు నిలిపి వేయటం రైతులకు శాపంగా మారింది. పత్తిని ఆరబెట్టి విక్రయించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నా. వాహనాన్ని సిద్ధం చేసుకొని సోమవారం మిల్లుకు తరలించాలనుకున్నా. అయితే కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల వద్ద బోర్డు పెట్టారు. ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే క్వింటాకు రూ. 2 వేల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
– ఎస్. వెంకటేశ్వర్లు, రైతు,
ఎదుళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం
జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లకు ఎంపిక చేసిన ఎనిమిది జిన్నింగ్ మిల్లుల్లో ఎలాంటి సమస్యలు లేవు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 వంటి సమస్యలు జిల్లాలో లేవు. పంట కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయి. రైతులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
– ఎంఏ అలీం, డీఎంఓ
పత్తి కొనుగోళ్లల్లో సమస్యలు పరిష్కారమయ్యే వరకు జిన్నింగ్ మిల్లులను బంద్ చేస్తున్నాం. రాష్ట్ర కాటన్ ట్రేడర్స్, మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలో సీసీఐ గుర్తించిన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు నిర్వహించేది లేదు. – రేగూరి వెంకన్న,
రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అధికార ప్రతినిధి
పత్తి కొనుగోళ్లకు బ్రేక్
పత్తి కొనుగోళ్లకు బ్రేక్
పత్తి కొనుగోళ్లకు బ్రేక్


