అవస్థల్లో హబ్..
టీ హబ్‌లో తరచూ మొరాయిస్తున్న యంత్రాలు
వారంలో రెండు, మూడు సార్లు నిలిచిపోతున్న పరీక్షలు
కాలం తీరిన మిషనరీలే
కారణమంటున్న సిబ్బంది
హబ్‌లో నిర్వహించిన టెస్టులిలా..
పట్టింపు కరువు..
కమిషనర్‌కు లేఖ రాశాం
ఖమ్మంవైద్యవిభాగం : ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ సమస్యలు ఎదుర్కొంటోంది. యంత్రాలు తరచూ మొరాయిస్తుండగా పరీక్షలకు అంతరాయం కలుగుతోంది. పేదలకు ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం డయాగ్నొస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. కొంత కాలం పాటు సక్రమంగానే పని చేసినా.. ఇటీవల తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రసాయనాల కొరతతో టెస్టులు నిలిచిపోతుండగా, ఇప్పుడీ మొరాయింపుతో ఇబ్బందులు మరింతగా పెరిగాయి. టీ హబ్‌లో గతంలో క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయో కెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 134కు పెంచారు. ఈ పరీక్షలకు ప్రస్తుతం అంతరాయం ఏర్పడుతుండగా పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు.
తరచూ అంతరాయం..
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాగ్నొస్టిక్ హబ్‌లో గంటకు 1,520 పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. ఇందులో కెమిస్ట్రీ ఎనలైజర్ మిషన్ ద్వారా 1,200 టెస్టులు, ఇమ్యూనో ఎనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా 100 టెస్టులు ఒకేసారి నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వం హబ్ ద్వారా 134 రకాల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. బయో కెమిస్ట్రీకి చెందిన 64 టెస్టులు, పాథాలజీకి చెందిన 28, మైక్రోబయాలజీ పరీక్షలు 42 ఈ హబ్ ద్వారా చేస్తారు. అయితే వారానికి రెండు, మూడు సార్లు యంత్రాలు మొరాయిస్తుండడంతో చేసేది లేక పేషెంట్లు ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రూ.వేలు చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో 26 పీహెచ్‌సీలు, 4 యూపీహెచ్‌సీలు, 9 పట్టణ దవాఖానాలు, 7 సీహెచ్‌సీల నుంచి నిత్యం టీ హబ్‌కు రక్త నమూనాలు పంపిస్తుంటారు. ఇక్కడ పరీక్ష చేసి 24 గంటల్లో బాధితుడి సెల్‌కు మెసేజ్ పంపిస్తారు. దాన్ని బట్టి వైద్యులు మందులు ఇవ్వడం నిరంతరం జరిగే ప్రక్రియ.
సంవత్సరం పేషెంట్లు సేకరించి శాంపిళ్లు టెస్టులు
2021 26,529 54,090 1,23,099
2022 82,860 1,69,044 3,61,900
2023 1,67,615 3,41,367 7,32,169
2024 2,16,309 3,91,415 7,72,364
2025(ఇప్పటివరకు) 1,59,258 2,68,917 5,48,917
ఖమ్మం ఆస్పత్రిలో 2021లో టీ హబ్ సేవలు అందుబాటులోకి రాగా, ఇప్పటివరకు 6,52,571 మందికి టెస్టులు నిర్వహించారు. వారి ద్వారా 12,24,833 శాంపిళ్లు సేకరించగా, 25,38,449 రకాల పరీక్షలు చేశారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హబ్‌పై పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ మిషన్లు మొరాయిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మిషన్లు మొరాయించగా సర్వీస్ ఇంజనీర్లను హైదరాబాద్ నుంచి పిలిపించి తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. అయితే అది మళ్లీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న మిషన్లకు కాలం తీరడమే ఇందుకు కారణమని, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గం లేదని సిబ్బంది చెబుతున్నారు.
ఆస్పత్రి ఆవరణలోని హబ్‌లో టెస్టింగ్ మిషన్లు తరచూ మొరాయిస్తున్నాయి. మరమ్మతులకు వచ్చినప్పుడల్లా సర్వీస్ ఇంజనీర్లను పిలిపించి తిరిగి అందుబాటులోకి తెప్పిస్తున్నాం. ఈ విషయమై కమిషనర్‌కు లేఖ రాశాం. ఉన్నతాధికారులు ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటాం.
– ఎం.నరేందర్, మెడికల్ సూపరింటెండెంట్
అవస్థల్లో హబ్..
అవస్థల్లో హబ్..


