అర్హులందరికీ ఇళ్లు..
● ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాల్లో
మంత్రి పొంగులేటి
సత్తుపల్లి : జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావునగర్‌లో షేక్ చత్తా బీ, నేతాజీ రోడ్‌లో పాండె సత్యవతి, శ్రీనివాస టాకీస్ రోడ్‌లో కొవ్వూరు వెంకటేశ్వరరావుతో గృహ ప్రవేశాలు చేయించిన పొంగులేటి.. వారికి నూతన వస్త్రాలు అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మట్టా దయానంద్, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్‌బాబు, నారాయణవరపు శ్రీనివాస్, గాదె చెన్నారావు, దొడ్డా శ్రీనివాసరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, ఎండీ కమాల్‌పాషా, దాసరి వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌కే నాగుల్‌మీరా, కంటే నాగలక్ష్మి, దూదిపాల రాంబాబు, వీరివాడ నాగభూషణం, రాయల కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రతీ అక్షరం ప్రజలకు ఉపయోగపడాలి
ఖమ్మంగాంధీచౌక్ : రచయితలు రాసే ప్రతీ అక్షరం సమాజానికి ఉపయోగపడాలని సాహితీవేత్త ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు అన్నారు. వర్గ దృక్పథంతో చరిత్రను స్థిరీకరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ఎన్.తిర్మల్ రాసిన ‘మట్టిపువ్వు’ పుస్తకాన్ని ఆవిష్కరించగా.. జయధీర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాహిత్యం సామాజిక వాస్తవికతలను, సమతుల్యతలను వ్యక్తం చేయాలన్నారు. స్వీయ జీవన వచనంలో రాయటం అవసరమని తెలిపారు. సెల్‌ఫోన్, ఫేస్‌బుక్‌లే వ్యాపకం అయిన చోట రచయితల పాత్ర అవసరం చాలా ఉందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. తిర్మల్ ఉద్యమాల నుంచి ఎదిగిన కవి అని, సామాజిక ఉద్యమాల నుంచి పుట్టిన రచయిత అని అన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు మువ్వా శ్రీనివాసరావు, జీవన్, హనీఫ్, గూడూరు మనోజ్, దిలావర్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత అవునూరి మధు, సాహితీ స్రవంతి మాజీ కన్వీనర్ కపిల రాంకుమార్, వికాస వేదిక కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం అమ్మకాల్లో
దళారులను ఆశ్రయించొద్దు
నేలకొండపల్లి : జిల్లాలో 154 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని జిల్లా సహకార శాఖాధికారి జి.గంగాధర్ సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నేలకొండపల్లి మండలంలో ఆదివారం నిర్వహించిన సహకార వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. కేంద్రాల్లో విక్రయించిన రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లోనే డబ్బులు జమవుతాయని చెప్పారు. కేంద్రాల్లో విక్రయించిన వెంటనే టక్‌షీట్ జనరేట్ చేయించుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 76 సహకార సంఘాల్లో ఈనెల 20 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అధికారులు రాజయ్య, రాజశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.
రామయ్య సేవలో
ఎంపీ బలరాం నాయక్
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో ఎంపీకి వేదాశ్వీరచనం చేసి స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్ రావు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు..


