బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
● ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి ● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఖమ్మంవైరారోడ్ : బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ హామీ నెరవేర్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. దానవాయిగూడెంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నాటిన తాటి, ఈత వనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. రిజర్వేషన్ సాధనకు ఢిల్లీలో కాంగ్రెస్ ఏం పోరాటం చేసిందని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని నిలదీశారు. బీసీలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని, గతంలో అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఎలా జరిగిందో రాష్ట్రంలో అందరికీ తెలుసని, కాంగ్రెస్ పార్టీ వాపు చూసి బలుపు అనుకుంటోందని ఎద్దేవా చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఒరిగిందేమీ లేదని, కీలకమైన శాఖలు వారి వద్ద ఉన్నా చేపట్టిన పనులు శూన్యమని విమర్శించారు. వచ్చే ప్రతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు డోకుపర్తి సుబ్బారావు, తిరుమలరావు, షకీనా, తదితరులు పాల్గొన్నారు.


