అందరికీ న్యాయం దక్కేలా కృషి
ఖమ్మం లీగల్ : ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను రూపుమాపి అందరికీ న్యాయం దక్కేలా న్యాయ సేవా సంస్థలు పని చేస్తున్నాయని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం.అర్చనాకుమారి తెలిపారు. ఆదివారం నిర్వహించిన న్యాయ సేవల దినోత్సవంలో ఆమె మాట్లాడారు. దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో సమానంగా న్యాయవ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. భార్యాభర్తలు తరచూ కలహించుకుంటే సమాజంలో చెడు ప్రభావం కనిపిస్తుందని హెచ్చరించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కల్పన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని అన్నారు. న్యాయ సేవా సంస్థ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతీ పౌరుడికి హక్కులు కల్పిస్తే, వాటి సంరక్షణకు న్యాయస్థానాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సభ్యురాలు సంధ్యారాణి, బార్ కార్యదర్శి దిలీప్, ఇమ్మడి లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, డిఫెన్స్ కౌన్సిల్ ఖండే వెంకటేశ్వరరావు, న్యాయవాదులు శ్రీనివాస్ శర్మ, మారగాని శ్రీనివాస్, వీరేందర్, పద్మావతి, పద్మ ప్రసూన, అనురాధ, రవీంద్ర స్వామి, జాలావతి, రమాదేవి, లక్ష్మి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


