సులభంగా సమర్పించొచ్చు.. | - | Sakshi
Sakshi News home page

సులభంగా సమర్పించొచ్చు..

Nov 10 2025 8:34 AM | Updated on Nov 10 2025 8:34 AM

సులభం

సులభంగా సమర్పించొచ్చు..

జిల్లాలో పెన్షన్‌దారుల వివరాలు..

లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంలో

తీరిన ఇక్కట్లు

పెన్షనర్ల సమస్య తీర్చేలా అమలు

ఇంటి నుంచే ఫోన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసేలా అవకాశం

సద్వినియోగం చేసుకోండి

ఖమ్మంసహకారనగర్‌: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించేందుకు గతంలో నానా తంటాలు పడాల్సి వచ్చేది. అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశాన్ని కల్పించింది. జిల్లా ట్రెజరీ కార్యాలయం (ఖమ్మం డీటీఓ)తో పాటు ఒక అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీస్‌(ఏటీఓ), నాలుగు సబ్‌ ట్రెజరీ కార్యాలయాలు(ఎస్‌టీఓ)ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తంగా 12,984 మంది పెన్షనర్లు ఉన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు ఏటా ఒకసారి జీవన ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. ఈ పత్రం సమర్పిస్తేనే ఆ తర్వాత పెన్షన్‌ను ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే, రిటైర్డ్‌ అయిన వారిలో 61 ఏళ్లు దాటిన వారు, వయోవృద్ధులు ఉంటారు. వీరంతా శ్రమకోర్చి ఎస్‌టీఓ, మీ సేవ కేంద్రాలకు వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. కొందరు నడిచే పరిస్థితిలో కూడా ఉండరు. దీంతో వీరు జీవన ధ్రువీకరణ పత్రం సమర్పించాలంటే ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సిన పరిస్థితుతులు నెలకొన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పెన్షన్‌దారులు లైఫ్‌ సర్టిఫికెట్‌ (జీవన ధ్రువీకరణ పత్రం) సమర్పించేందుకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా సెల్‌ఫోన్‌లోనే మీ సేవ యాప్‌, జీవన ప్రమాణ్‌ ద్వారా, ఐఎఫ్‌ఎంఐఎస్‌ యాప్‌ ద్వారా సమర్పించే వీలు కల్పించింది.

జీవన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి..

పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్‌ పొందాలంటే ఏటా నవంబర్‌ ఒకటి నుంచి మార్చి 31లోపు జీవన ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. పెన్షన్‌ తీసుకుంటున్న వ్యక్తి బతికే ఉన్నాడని గెజిటెడ్‌ ఉద్యోగి సంతకంతో కూడిన సర్టిఫికెట్‌ను ఎస్‌టీఓల్లో సమర్పించాలి. ఇలాంటి సమయాల్లో పలు సాంకేతిక సమస్యలు వస్తున్న క్రమంలో అలాంటి వాటిని అధిగమిస్తూ మొబైల్‌ యాప్‌లోనే లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే అవకాశం ఉంది.

ఇలా చేయాలి

ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో తొలుత మీ సేవ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందులో ప్రధానంగా వివిధ రకాల ఆప్షన్లు వస్తాయి. అందులో పెన్షన్‌దారు జీవన ధ్రువీకరణ అనే దగ్గర ప్రెస్‌ చేయాలి. అనంతరం డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ను ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ (నమోదు), రిజిస్ట్రేషన్‌ స్థితి తనిఖీ, జీవన ధ్రువీకరణపత్రం సమర్పణ, రశీదులు అనే అంశాలు చూపిస్తాయి. ఇందులో రిజిస్ట్రేషన్‌ నమోదు అనే ఆప్షన్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్‌ ఓపెన్‌ చేసిన తర్వాత బ్యాంక్‌ ఖాతా నంబర్‌ లేదంటే పీపీఓ ఐడీ (8 అంకెలు), మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేసి కొనసాగించండి అనే నెంబర్‌ను ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత లైవ్‌ ఫొటో.. ఫొటోను క్లిక్‌ చేయండి అనే ఆప్షన్లు వస్తాయి. ఫొటోను క్లిక్‌ చేయండి అనే ఆప్షన్‌ నొక్కాలి. ఆ తర్వాత ఫొటో దిగి సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న వివరాలను సరిచూసిన తర్వాత అక్కడ సిబ్బంది ఓకే చేస్తారు. వెంటనే పెన్షన్‌దారుడి ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. ఈ మెసేజ్‌ రావటానికి ఆలస్యమైతే ట్రెజరీ కార్యాలయంలో వివరాలు తెలుసుకోవచ్చు. మెసెజ్‌ వచ్చిన వారు ఆ మెసేజ్‌ ఆధారంగా తిరిగి జీవన ధ్రువీకరణపత్రం సమర్పణ అని వస్తుంది. అందులో యథావిధిగా పెన్షన్‌దారుల వివరాలు సమర్పించి సెల్ఫీ ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత పెన్షన్‌దారుల వివరాలు సబ్‌మిట్‌ చేసినట్లు రశీదు సైతం తీసుకోవచ్చు. ఒక ఫోన్‌లో యాప్‌ నుంచి ఎంతమంది పెన్షన్‌దారుల వివరాలైనా నమోదు చేయొచ్చు.

75 ఏళ్లు దాటితే రావాల్సిందే..

పెన్షనర్లలో 75 సంవత్సరాలు దాటిన వారంతా తప్పకుండా నేరుగా ఎస్‌టీఓ, డీటీఓల కార్యాలయాలకు వెళ్లి లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా మెంటల్లీ డిజార్డర్స్‌, డైవర్స్‌ పెన్షనర్లు, విడో పెన్షనర్లు, అవివాహితులు పెన్షన్‌ పొందుతున్నట్లయితే నేరుగా ఎస్‌టీఓ, డీటీఓల్లో గెజిటెడ్‌ ఆఫీసర్‌చే ధ్రువీకరించిన లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఖమ్మం డీటీఓ 9,043

వైరా, ఏటీఓ 453

మధిర, ఎస్‌టీఓ 1,293

నేలకొండపల్లి, ఎస్‌టీఓ 644

సత్తుపల్లి, ఎస్‌టీఓ 1,551

మొత్తం 12,984

రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు మీ సేవ యాప్‌, జీవన ప్రమాణ, పెన్షనర్లు ఐఎఫ్‌ఎంఐఎస్‌ యాప్‌ ద్వారా నేరుగా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే, 75 ఏళ్లు దాటిన వారు మాత్రమే నేరుగా ఎస్‌టీఓ, డీటీఓలకు వెళ్లి లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. –వెంటపల్లి సత్యనారాయణ,

ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, ఖమ్మం

సులభంగా సమర్పించొచ్చు.. 1
1/1

సులభంగా సమర్పించొచ్చు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement