
మరి ఎవరిది బాధ్యత?
కాంట్రాక్టర్, ఏఈ
నడుమ వాగ్వాదం
● కేఎంసీ పరిధి ఈఎండీ, ఎఫ్‌ఎస్‌డీ చెల్లింపుల్లో సమస్యలు ● పనులు తమ హయాంలో జరగలేదని అధికారుల దాటవేత ● ఇబ్బంది పెట్టొద్దని కాంట్రాక్టర్ల ఆవేదన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు విలువలో కొంత నగదును జమ చేయాల్సి ఉంటుంది. ఈఎండీ(ఎర్నేస్ మనీ డిపాజిట్), ఎఫ్‌ఎస్‌డీ(ఫరదర్ సెక్యూరిటీ డిపాజిట్)ల రూపంలో కేఎంసీ ఖాతాకు జమ చేస్తే.. పనులు పూర్తయ్యాక నాణ్యతను పరీక్షించి అధికారులు తిరిగి చెల్లిస్తారు. అయితే, కొన్నేళ్లుగా ఈఎండీలు, ఎఫ్ ఎస్‌డీల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు కేఎంసీ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల కమిషనర్ అభిషేక్ అగస్త్య చొరవతో కాంట్రాక్టర్లకు చెల్లింపులు సాఫీ గానే జరిగినా.. కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ అధికా రుల తీరుతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
ముందుగానే నగదు జమ
కాంట్రాక్టర్లకు పనులు కేటాయించే సమయాన అధికారులు ఈఎండీ కట్టించుకుంటారు. ఈఎండీ రూపంలో పని విలువ ఆధారంగా 1 – 1.50 శాతం వరకు కట్టించుకుంటుండగా.. 2.50శాతం ఎఫ్ ఎస్‌డీగా కేఎంసీ ఖాతాలోనే ఉంచుతున్నారు. పనులు పూర్తయిన ఆరు నెలల నుండి మూడేళ్ల లోపు కాంట్రాక్టర్‌కు వీటిని తిరిగి చెల్లించాలి. అయితే కేఎంసీలో ఎఫ్‌ఎస్‌డీని 2.50 శాతం నుండి 7 శాతం వరకు అంటిపెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు వీటి చెల్లింపులపై అధికారులు – కాంట్రాక్టర్లకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి.
అప్పుడు మేం లేము...
ఇటీవల అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)లుగా కేఎంసీలో బాధ్యతలు చేపట్టిన ఇంజనీరింగ్ అధికారుల తీరును కాంట్రాక్టర్లు తప్పు పడుతున్నారు. గతంలో తాము చేసిన పనులకు సంబంధించి ఈఎండీ, ఎఫ్‌ఎస్‌డీ చెల్లించాలని కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారులను కోరితే.. పనులు జరిగిన సమయాన తాము విధుల్లో లేమంటూ దాటవేత ధోరణి పదర్శిస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా ఏఈల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఇదే సమస్యపై కమిషనర్‌ను కలిస్తే బిల్లులు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసినా అధికారులకు పెడచెవిన పెడుతున్నారని వాపోతున్నారు. పనులు జరిగిన సమయాన ఉన్న అధికారులు ఇప్పుడు ఇతర మున్సిపాలిటీలకు వెళ్లారని, ఉద్యోగుల బదిలీలు సహజమే అయినప్పుడు తమ బిల్లులు ఆపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
రూ.2 కోట్లకు పైగానే..
గతంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి ఈఎండీలు, ఎఫ్‌ఎస్‌డీల బకాయి రూ.2 కోట్లకు కేఎంసీ ఖాతాలో ఉన్నట్లు తెలుస్తోంది. పనులు చేసేందుకు రూ.కోట్ల అప్పులు తీసుకొస్తున్న తాము ఈఎండీలు, ఎఫ్‌ఎస్‌డీ చెల్లింపుల్లో కేఎంసీ అధికారులు తీరు కారణంగా మరింత ఇబ్బంది పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈఎండీలు, ఎఫ్‌ఎస్‌డీలపై ఇంజనీరింగ్ అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై కాంట్రాక్టర్లు జట్టుగా జిల్లా ప్రజాప్రతినిధులను కలవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్, ఏఈ మధ్య శుక్రవారం వాగ్వాదం చోటు చేసుకుంది. కమిషనర్ పేషీ వద్ద వీరిద్ద మధ్య మొదలైన మాటల యుద్ధం చివరకు తీవ్ర స్థాయికి చేరింది. అక్కడ ఉన్న సిబ్బంది, ఇతర కాంట్రాక్టర్లు వారిని వారించారు. ఈఎండీలు, ఎఫ్‌ఎస్‌డీలు చెల్లించాలని కొద్దిరోజులుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈవిషయంలోనే ఏఈని అడగగా గతంలో జరిగిన పనులకు సంబంధించి తనకు తెలియదంటూ దాటవేయడంతో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కాగా, కాంట్రాక్టర్, ఏఈ మధ్య వాగ్వాదంపై కొందరు కాంట్రాక్టర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.