
గంగమ్మ చెంతకు దుర్గమ్మ
భద్రాచలం గోదావరిలో
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం
నేడు, రేపు మరింతగా పెరిగే అవకాశం
భద్రాచలంఅర్బన్ : ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి భద్రాచలం గోదావరి ఘాట్ వద్దకు చేరుకున్నాయి. ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహాలు మాత్రమే గోదావరిలో నిమజ్జనానికి వస్తుంటాయి, అమ్మవారి విగ్రహాలు వచ్చినా చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేవి. అయితే ఈ ఏడాది అనూహ్యంగా విజయదశమి పండుగ రోజు అర్ధరాత్రి తర్వాత నిమజ్జన ఘాట్ వద్దకు అధిక సంఖ్యలో విగ్రహాలు చేరుకున్నాయి. కాగా, ఇక్కడ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల్లో కొంతమేర ఆందోళన వ్యక్తమైంది. దీంతో అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఒక లాంచీతో పాటు క్రేన్ ఏర్పాటు చేశారు. కాగా, శని, ఆదివారాల్లో అమ్మవారి విగ్రహాలు నిమజ్జనానికి భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 42 విగ్రహాలు నిమజ్జనం కాగా, మరో 30 విగ్రహాలు గోదావరి ఘాట్ వద్ద ఉన్నాయి.
నిమజ్జనం ఘాట్‌ను సందర్శించిన ఏఎస్పీ
భద్రాచలం గోదావరి నది ఘాట్ వద్ద అమ్మవారి విగ్రహాల నిమజ్జనాన్ని ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ శుక్రవారం సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలను పాటించాలని, కార్యక్రమం ప్రశాంతంగా సాగేలా సహకరించాలని కోరారు. వీలైనంత త్వరగా విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
మేం గత ఐదేళ్లుగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాలు నిమజ్జనం చేయాలనుకున్నాం. గతేడాది బాసరలో నిమజ్జనం చేశాం. ఈ ఏడాది భద్రాచలంలో నిమజ్జనం చేయాలని 200 మందిమి వచ్చాం.
– బాలకృష్ణ, హైదరాబాద్

గంగమ్మ చెంతకు దుర్గమ్మ

గంగమ్మ చెంతకు దుర్గమ్మ